విశాఖలో చంద్రబాబుకు నిరసన సెగ..గుడ్లు, చెప్పులతో.. - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో చంద్రబాబుకు నిరసన సెగ..గుడ్లు, చెప్పులతో..

February 27, 2020

cfb f

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వైసీపీ కార్యకర్తలు ఆయన పర్యటనకు అడ్డు తగిలారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ – టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బాబుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేయడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

కొంతమంది వైసీపీ కార్యకర్తలు కోడి గుడ్లు, టమాటాలు వెంట తీసుకువచ్చారు. మరికొందరు  చెప్పులు చూపిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చేసేదేమి లేక చంద్రబాబు నడక మార్గంలో ముందుకు కదిలారు. కాగా విశాఖ వచ్చిన చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు కూడా తరలివచ్చారు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా ఈ ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోకి వైసీపీని ఎలా అనుమతిస్తారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూసమీకరణ బాధితులైన రైతులను పరామర్శించడానికి చంద్రబాబు ఈ పర్యటనకు విశాఖ వచ్చారు.