తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి పట్ల తెలంగాణలో జరిగిన ఘటన తమకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు. తెలంగాణలో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తన కారును స్వయంగా డ్రైవింగ్ చేస్తూ తీసుకురాగా.. ఆమె కారు లోపల ఉండగానే ఆ కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కారు డోర్స్ బ్రేక్ చేసి షర్మిలను పీఎస్‌లోకి తరలించారు. వీఐపీ మూమెంట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని పోలీసులు షర్మిలపై 353, 333, 327 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో.. పలు టీవీ ఛానెళ్లలో ప్రసారం కావడంతో ఏపీ నేతలు స్పందించారు. దీనిపై తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. షర్మిల అరెస్ట్ బాధాకరం అన్నారు. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం కరెక్ట్ కాదని మీడియా స్పష్టం చేశారు. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టుకున్నారు. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోమన్నారు.
మరోవైపు షర్మిల అరెస్ట్‌కు నిరసనగా.. ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లో ఎస్.ఆర్.నగర్ పీఎస్ ఎదురుగా ఉన్న భవనం ఎక్కి ఆందోళనకు దిగారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.