తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ ఉద్ధరించేందేంటని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సోమవారం (నిన్న) సాయంత్రం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులంతా ప్రస్తుతం భయంలో ఉన్నారని.. నరేంద్ర మోదీ ఎక్కడ వస్తారో, అమిత్ షా ఎక్కడ వస్తారో అనే భయం వెంటాడుతోందని పేర్ని నాని విమర్శించారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రుల పేర్లు లాటరీలు తీస్తున్నారని సెటైర్లు వేశారు. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని.. బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పులేదని ఎద్దేవా చేశారు.
‘టీఆర్ఎస్ అంతర్ధానమైపోయిందిగా.. కొత్తగా బీఆర్ఎస్ అనుకుంటా. కేసీఆర్ ఏంటి ఇక్కడికి వచ్చి చేసేది? శుభ్రంగా అక్కడ చూసుకోమని చెప్పండి. అక్కడే సరిగా లేకుంటే.. మళ్లీ ఇవన్నీ ఎందుకు? ఏ లాటరీలో ఎవరి చీటీ తగులుతుందో అని ఓ వైపు వాళ్ల మంత్రులందరూ కంగారు పడతా ఉంటే..!’ అంటూ పేర్ని నాని విమర్శలు చేశారు.
‘శ్రీశైలం డ్యామ్‌లో దొంగ కరెంట్, నాగార్జున సాగర్ డ్యామ్‌లో దొంగ కరెంట్, పులిచింతలలో దొంగ కరెంట్ ఉత్పత్తి చేసి.. ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పంపిస్తుంటే.. వాళ్లు వచ్చి మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? ఈ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడుస్తోంది ఎవరు? ఏంటి వాళ్లు ఉద్ధరించేంది ఇక్కడ.. కొంచెం సిగ్గు ఉండాలి కదా? మా ఆస్తులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా? మా ఆస్తులన్నీ తీసుకున్నారు కదా? కరెంటు బాకీలు కట్టారా? ఆ డబ్బులన్నీ ఏవి? ఇంత ద్రోహం ఈ రాష్ట్రానికి చేసి.. కనీసం నవ్వుతారని కూడా లేకుండా, ఈ రకమైన పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఏదో మాట్లాడుతారు వాళ్లు. ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారండీ. వాళ్లు ఉద్ధరించేది ఏంటి?’ అని పేర్ని నాని అన్నారు.