త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు 2, 3 నెలల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పడుతుందన్నారు. ఆదివారం కుటుంబసభ్యులతో కలసి విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు బొత్స. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రెండు, మూడు నెలల్లోనే విశాఖ రాజధాని అవుతుందని ఆకాంక్షించారు.
“గత సంవత్సరం కన్నా ఈ ఏడాది మరింత వృద్ధి సాధించాలని అమ్మవారి కోరుకున్నాను. విద్య, వైద్య, సంక్షేమం, సీఎం జగన్ ఆశయం నెరవేరాలని కోరుకున్నాను. వచ్చే రెండు మూడు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వాలన్నది మా కోరిక. అది అవుతుంది కూడా. రాష్ట్ర ప్రజలు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇదంతా జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన త్వరలోనే ఉంటుంది” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖ రాజధానిగా పాలనపై ఇప్పటికే వైసీపీ మంత్రులు స్పష్టత ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్ నుంచి సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని గతంలోనే తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ భవనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండపై నిర్మిస్తున్న భవనాలు సిద్ధం అయ్యాక ప్రభుత్వ శాఖల షిఫ్టింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు. ఇటీవల విశాఖలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆ పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి తరువాత ఏ క్షణమైనా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నట్టు పార్టీ సంకేతాలు ఇస్తుంది.