ఏపీ వైసీపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రి రేషన్ బియ్యం వద్దనుకునే వారికి నగదు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నగదు ఆఫర్ చేస్తున్నారంటే తొందర్లోనే రేషన్ బియ్యం పథకానికి ఎగనామం పెట్టబోతున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి తాజాగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాన్నే తాము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నగదు పథకాన్ని ఏ ఒక్కరిపైనా బలవంతంగా రుద్దట్లేదని వెల్లడించారు. కేంద్రం సూచనల ప్రకారమే వెళ్తున్నామని, మా ప్రభుత్వ చర్యలను విమర్శిస్తే ప్రధాని మోదీని విమర్శించినట్టే అవుతుందని తేల్చి చెప్పారు.