ఈ మధ్య వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తరచూ సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోందని, అదే జరిగితే ముందుగానే ఇంటికి వెళ్తామని (ఓడిపోతామని) కీలక వ్యాఖ్యలు చేశారు. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణంపై మాట్లాడే క్రమంలో ఆయన ఈ విధంగా స్పందించారు. సచివాలయ భవనాలకు శంఖుస్థాపన చేసిన తనకే నిర్మాణాలు ఎందుకు పూర్తికాలేదో అర్ధం కావట్లేదన్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సొంతడబ్బు పెట్టి నిర్మిస్తే బిల్లులు రావని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.
అధికారులను అడిగితే త్వరలో పూర్తి చేస్తామని అంటున్నారని, అవి పూర్తయ్యేలోపు తమ పదవీకాలం అయిపోతుందని అన్నారు. అంతకుముందు కూడా ఆనం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏదైనా అంటే పెన్షన్లు ఇస్తున్నామంటారు అవి ఓట్లు కురిపిస్తాయా? అని నిలదీశారు. ‘నాలుగేళ్లలో ఏం చేశాం? గత ప్రభుత్వం పని చేయలేదని చెప్పి అధికారంలోకి వచ్చాం. మరి మనం ప్రాజెక్లు ఏమైనా కట్టామా? పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించాం? కేంద్రం నిధులు ఇస్తేనే నీళ్లిచ్చే పరిస్థితి నెలకొంది. రోడ్లపై గుంతలు పూడ్చలేకపోతున్నాము’ అంటూ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మంత్రి అంబటి రాంబాబు కూడా గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే సీట్ల సంఖ్య తగ్గొచ్చేమో కానీ అధికారం మాత్రం వైసీపీదేనని కరాఖండీగా చెప్పారు. ఒకవైపు సీఎం జగన్ సహా మిగతా మంత్రులు, నేతలంతా వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలవాలని పని చేస్తుంటే వీళ్ళేంటీ ఇలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆనంపై వేటు?
ఇక తరచూ ఇబ్బంది పెడుతున్న ఆనంపై అధిష్టానం వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లి వారసుడు రాంకుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన వస్తుందని అంచనా. దీన్ని ముందే గ్రహించిన ఆనం.. కొద్ది రోజుల క్రితం తాను ఎమ్మెల్యేనా? కాదా? అని పార్టీ పరిశీలకుడి ముందే ఆగ్రహం చెందారు. నియోజకవర్గంలో సమన్వయం కొరవడిందని, ఓ వ్యక్తి ఇప్పుడే ఎమ్మెల్యే అయిపోనట్టు ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తనను ప్రజలు ఐదేళ్లకు ఎన్నుకున్నారని, చివరి రోజు వరకు తానే ఎమ్మెల్యేనన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు వైసీపీ నుంచి పోటీ చేస్తారోనని వైసీపీ శ్రేణులు తికమకపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
తనకు సాయం చేసిన వారితో మాట్లాడిన పంత్..ఫోటో వైరల్