రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై దాడిచేసి చెంప మీద కొట్టారని పోలవరం ప్రాజెక్టు ఏఈఈ సూర్యకిరణ్ గురువారం రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సూర్యకిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘2020లో పోలవరం ఎడమకాలువ పరిధిలోని టెయిల్ ఎండ్ రైతులు మాకు నీళ్లు రావట్లేదని ఫిర్యాదు చేశారు. అయితే మాకు వెంటనే నీళ్లు కావాలి కాబట్టి మా స్వంత ఖర్చులతోటి పూడిక తీసుకుంటామని, బిల్లులు తర్వాత ఇచ్చినా పర్వాలేదని రైతులు పనులు నిర్వహించారు.
కానీ, ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు ఏడాది నుంచి బిల్లుల గురించి అధికారులను అడుగుతూనే ఉన్నారు. తాజాగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగులో కూడా బిల్లుల గురించి అడిగారు. నేను వివరణ ఇస్తుండగా.. మా ఈఎస్ఈ పక్కన ఉండగానే ఎమ్మెల్యేగారు నన్ను కొట్టారు. చెంపమీద మూడు సార్లు కొట్టారు. మా శాఖ మంత్రి అంబటి రాంబాబు పక్క గదిలోనే ఉన్నారు. దాంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశా’నని వెల్లడించారు. కాగా, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ వైసీపీపై విమర్శలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై పెరిగిన దాడులంటూ ట్వీట్ చేసింది.