Flood victims Rs. 2 thousand financial assistance: Jagan
mictv telugu

చెప్పుతో కొడతా.. వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్

September 27, 2022

తన నియోజకవర్గంలో అవినీతికి పాల్పడే వాలంటీర్లు, కౌన్సిలర్లకు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో మందలించారు. ఎవరైనా ప్రజల నుంచి లంచం లేదా డబ్బు వసూలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని, అలాంటి వారిని నడిరోడ్డుపై చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఈ మేరకు వారికి పంపిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెన్షన్ ఇచ్చేటప్పుడు కొందరు డబ్బులు అడుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి పనులు మానుకోవాలని సూచించారు. ఈ వాయిస్ రికార్డును ఎమ్మెల్యేనే స్వయంగా పంపినట్టు తెలుస్తోంది. అందులో ‘గుడ్ ఆఫ్టర్ నూన్ వాలంటీర్స్.. నేను మీ ఎమ్మెల్యేను మాట్లాడుతున్నా. మీ వార్డుల్లో ఎలాంటి కరప్షన్‌కి పాల్పడబోమని మా ముందు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. మర్యాదగా తీసుకున్న డబ్బు తిరిగిచ్చేయండి. లేదంటే ఒక్కొక్కడిని నడిరోడ్డులో చెప్పుతో కొడతా’ననే హెచ్చరించారు. అటు కౌన్సిలర్లకు పంపిన వాయిస్ రికార్డులో ‘గుడ్ ఆఫ్టర్ నూన్ కౌన్సిలర్స్. మనవాళ్లు ఒకట్రెండు చోట్ల చెయ్యి చాపుతున్నారు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. దయచేసి ఇంకోసారి ఇలా చేయవద్దు. లేదంటే క్రిమినల్ కేసులు పెట్టిస్తా. జీవితంలో మళ్లీ కోలుకోలేని విధంగా చర్యలు తీసుకుంటా’నని ఉంది. ఎమ్మెల్యే మంచి ఉద్దేశంతో పైమాటలు పలికినా, వాలంటీర్లను చెప్పుతో కొడతానంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.