కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. అనుమానం ఉన్న చోట ఉండాలని లేదని కోటం రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. “వైసీపీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నా వివరణ తీసుకోకుండానే నాపై చర్యలు చేపట్టారు. అధికార పార్టీ నేతలపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం బాధకలిగించింది” అని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్, సజ్జలకు తెలిసే..
నాలుగు నెలల ముందే ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు ఓ ఐపీఎస్ అధికారి చెబితే నమ్మలేదని కోటంరెడ్డి తెలిపారు. సీఎంపై కోపంతో అధికారి అబద్ధం చెప్పారని అనకున్నానని..కానీ కొన్ని రోజులుకు ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టినట్లు తెలిసిందని కోటంరెడ్డి వెల్లడించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వాపోయారు. ఫోన్ ట్యాప్‌పై ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. మరోవైపు ఇద్దరు ఐపీఎస్ ఉద్యోగులు ఇబ్బంది పడతారని కోటంరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ లేదా సజ్జలకు తెలీకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయడం అంతా సులభం కాదని తెలిపారు. మంత్రులు, అధికారులు, హైకోర్టు జడ్జిలు ఫోన్లు ట్యాప్ అవకాశం లేకపోలేదన్నారు. జగనన్నా..నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది ? అంటూ కోటం రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..
జగన్‌పై అభిమానంతో ఎన్నో అవమానాలను భరించానన్నారు. జగన్, వైసీపీపై ఏనాడూ పరుషంగా మాట్లాడలేదని తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని కోటం రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారని.. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నాను. నా మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం ఇష్టం లేదని కోటం రెడ్డి స్పష్టం చేశారు. తన మనసు వైఎస్సార్‌సీపీలో ఉండొద్దని చెబుతోందని పేర్కొన్నారు.