జగన్ ఆస్తి 510 కోట్లు.. చంద్రబాబు ఆస్తి ఎంతంటే : పేర్ని నాని
ఏపీసీఎం జగన్ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. సీఎం జగన్ కుటుంబం ఆస్తి 510 కోట్లు మాత్రమే అని చెప్పారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తి 1000 కోట్లకు పైగా ఉందన్నారు. ఇది తాము గాల్లో చెబుతున్న లెక్కలు కాదని.. చంద్రబాబు ఎన్నికల డిక్లరేషన్, ఆయన కుటుంబం ఐటీ రిటర్స్న్ ప్రకారం చెబుతున్నామని వివరించారు.
చంద్రబాబుకు ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఎంతో నిజాయితీగా చెప్పాలని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కేవలం రెండు ఎకరాల ఆస్తితో బయల్దేరి ఈరోజు రూ.1000 కోట్ల దాకా ఎదిగారని విమర్శించారు. అటువంటి నేత నిఖార్సైన నీతిమంతుడైన రాజకీయనేతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు సీఎం అయ్యే ముందు హెరిటేజ్ కంపెనీని ఏర్పాటు చేసి.. ఆ తర్వాత, దాంట్లో పార్ట్‌నర్లుగా ఉన్న మోహన్‌బాబు లాంటి పలువురిని బయటకు పంపించేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాకే హెరిటేజ్ కంపెనీ వృద్ధిలో ఎందుకు పరుగులు పెట్టిందని ప్రశ్నించారు. ఇవన్నీ చంద్రబాబు దాస్తే దాగేవి కాదన్నారు.