మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. ఈసారి సీఐని బెదిరిస్తూ.. - MicTv.in - Telugu News
mictv telugu

మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. ఈసారి సీఐని బెదిరిస్తూ..

September 19, 2020

gcngcn

వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వివాదాలు వీడటం లేదు. వరుసగా ఆమె ఏదో ఒక విషయంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ఓ సీఐని బెదిరిస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆమె సీఐని నోటికి వచ్చినట్టుగా తిడుతున్న మాటలు ఉండటంతో వివాదంగా మారింది. తన అనుచరుల వాహనాలను సీజ్ చేసినందుకు వెంటనే విడిచి పెట్టాలని ఆమె ఒత్తిడి తీసుకువచ్చారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుతో పోలీసులు పారదర్శకంగా పని చేసుకునే పరిస్థితి లేదని ఆక్షేపిస్తున్నారు. 

స్థానిక సీఐ ఇటీవల అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేశాడు. అవి ఉండవల్లి శ్రీదేవి అనుచరులకు చెందినవి కావడంతో వెంటనే వాటిని విడిచిపెట్టాలని ఆమె సీఐని ఆదేశించారు. కానీ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, తాను ఏం చేయలేనని చెప్పడంతో ఆమె తన నోటికి పని చెప్పారు. తాను తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ మండిపడ్డారు. ‘ఎమ్మెల్యే అంటే లెక్క చేయడం లేదు. మా వాళ్లని వదలిపెట్టవా..? నాన్సెన్స్.. నా కాళ్లు పట్టుకుని ఇక్కడికి పోస్టింగ్ తెచ్చుకున్నావ్. చెప్పింది చేస్తానని ఆ రోజు చెప్పావు. వాళ్ల వాహనాలు వదలకపోతే ఎస్పీకి, డీజీపీకి చెబుతా’ అంటూ బెదిరింపులకు దిగారు. కాగా ఇటీవలే ఆమెపై వైసీపీ నేత మేకల రవి కూడా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1.40 కోట్లు అప్పు తీసుకొని మిగిలిన రూ.80 లక్షలు ఇవ్వడం లేదని వాపోయిన సంగతి తెలిసిందే.