YCP MLA to vote in Telangana Assembly
mictv telugu

తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేయనున్న వైసీపీ ఎమ్మెల్యే

July 17, 2022

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేయనున్నారు. ఈ నెల 18న సోమవారం రోజు పోలింగ్ జరుగనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంటులో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయాల్సి ఉంది. అయితే ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల ఒక ఎమ్మెల్యే అటు ఢిల్లీలోగానీ, ఏదైనా పక్క రాష్ట్ర అసెంబ్లీలో ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పిస్తుంది. దీనికి ఈసీ నుంచి మందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఈసీని అభ్యర్ధించారు. పోలింగ్ జరిగే సోమవారం రోజున తాను తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఉండాల్సిన అవసరం ఉందని, దీంతో తనకు తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరగా, కారణం సరైనదేనని భావించిన ఈసీ అందుకు సరేనని ఒప్పుకుంది.