ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు వైసీపీ పార్టీలో కలహాలు కలవరపెడుతున్నాయి. ఒక పక్క నెల్లూరులో సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడితే.. కృష్ణా జిల్లా వైసీపీ నేతల మధ్య వర్గపోరు ముదురుతుంది. ఇటీవల సంచలనం రేపిన వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు సంభాషణపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
డొక్క చించి డోలు కడతాం
తన గురించి, కొడాలి నాని గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతామని హెచ్చరించారు. వాళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినాయకత్వానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని వంశీ చెప్పుకొచ్చారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసని చెప్పారు. వార్డుకు..పంచాయితీకి గెలవలేని వాళ్లు తనకు సహకరించకపోతే ఏమీ కాదని ధీమా వ్యక్తం చేసారు. “దుట్టా రామచంద్రరావు నాకు ఎప్పుడు పనిచేయలేదు. దుట్టా రామచంద్రరావు కూతురిని గెలిపించింది నేనే. అతడి కొడుకుకి పనిచేయాలి అల్లుడికి పని చేయాలి కాని.. పార్టీకి పనిచేయడు అంటూ వల్లభనేని ధ్వజమెత్తారు.
ఆ ఎదవలు లాగానే సంపాదించాం
గుడికి వెళ్లి పిచ్చివాగుడు వాగుతున్న మానసిక రోగులు అంటూ దుట్టాను, యార్లగడ్డను ఉద్దేశించి వల్లభనేని వ్యాఖ్యానించారు. ఈ ఎదవలు అందరూ ఎలా సంపాదించారో కొడాలి నాని, నేను కూడా అలాగే సంపాదించామని చెప్పారు.. వాళ్లకు లాగా గోనెసంచల్లో మూటలు కట్టుకొని కాటికి వెళ్ళినాక వాడుకోవడానికి దాచుకోవడం లేదని పదిమందికి మేము ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. నాతో కలిసి ప్రయాణం చేస్తే వాళ్ళ అదృష్టం లేకపోతే వాళ్ళ కర్మ అన్నారు.
దుట్ట, యార్లగడ్డ ఏమన్నారంటే..
ఇటీవల గుంటూరు జిల్లా వైకుంఠపురంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో యార్లగడ్డ వెంకటరావు..దుట్టా రామచంద్రరావు ఇద్దరూ కొడాలి నాని..వంశీ పైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వల్లభనేని వంశీ, కొడాలి నానికిసంబంధించిన ఆస్తులపై వారు మాట్లాడినట్టు ఆడియోలో ఉంది. ” వారిద్దరికి అన్ని అస్తులు ఎలా వస్తాయి. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారు.” అని వారు ప్రశ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను ప్రశ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందంటూ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ అన్నట్లు ఆడియోలో రికార్డు అయ్యింది.
ఇవి కూడా చదవండి :
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎదురుదాడి
పొంగులేటితో భేటీ నిజమే.. త్వరలోనే YSRTPలోకి.: వైఎస్ షర్మిల