సంచలనం.. నారా లోకేష్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

సంచలనం.. నారా లోకేష్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు భేటీ

May 28, 2022

ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యా రెడ్డి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. మహానాడులో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా హాజరవడంతో ఆయనను కలిసేందుకు తన భర్త రితేష్ రెడ్డితో కైవల్యా రెడ్డి ఒంగోలు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన భేటీలో త్వరలో జరుగనున్న ఆత్మకూరు ఉప ఎన్నికలో తమకు టికెట్ కేటాయించాలని కోరినట్టు తెలుస్తోంది. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు విడుదల అయింది. దీంతో ఆనం కూతురు లోకేష్‌ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్‌తో సన్నిహితంగా ఉండి ఆయన కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అనంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్‌లోనూ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 2014లో ఓడిపోయి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అప్పుడు ఆత్మకూరు అసెంబ్లీ టిక్కెట్ అడుగగా, వైఎస్ జగన్ వెంకటగిరి టిక్కెట్ ఇచ్చారు. అక్కడ గెలిచినా తర్వాత కేబినెట్‌లో చోటు కోసం ఆనం ప్రయత్నించారు. జిల్లాలో సీనియర్ అయిన తనకు మలి దశలోనూ మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో తన కూతురిని మహానాడుకు పంపించి, ఆత్మకూరు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, లోకేష్ ఎలా స్పందించారన్నది ఇంకా తెలియరాలేదు.