ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అనంత బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి నుంచి విచారణ చేపట్టిన పోలీసులు.. అనంత బాబుతోపాటు కొంతమంది అనుచరులు కలిసి హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారని వెల్లడించారు. సుబ్రహ్మణ్యంను కొట్టి చంపినట్టు తమ విచారణలో తేలిందని, ప్రస్తుతం అనంతబాబు కాకినాడ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నారని, మరికాసేపట్లో అరెస్ట్ చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. అనంతబాబుతోపాటు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
గత శుక్రవారం ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారులో ఓ యువకుడి మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే. మృతుడు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యంగా పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఉదయ్ భాస్కర్ తనతోపాటు సుబ్రమణ్యంను బయటకు తీసుకెళ్లి, కొంతమంది అనుచరులతో కలిసి అతడిని కొట్టిచంపి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని డ్రైవర్ తమ్ముడికి సమాచారం అందించారు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో మృతదేహాన్ని అనంతబాబు తన కారులో తీసుకొచ్చి, అతని తల్లిదండ్రులకు అప్పగించండంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి, ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం అనంతబాబును అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు నిజం బయటపడినట్లు తెలిపారు.