హంతక ఎమ్మెల్సీ అనంత్ నేరాల చిట్టా ఇదీ... - MicTv.in - Telugu News
mictv telugu

హంతక ఎమ్మెల్సీ అనంత్ నేరాల చిట్టా ఇదీ…

May 23, 2022

తన కారు డ్రైవర్‌ను హత్యచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన రాజకీయ ప్రస్థానమే కాక అంతకు ముందే నుంచే క్రిమినల్ హిస్టరీ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలప స్మగ్లింగ్, గంజాయి అక్రమ రవాణా, మహిళలపై వేధింపులు, దౌర్జాన్యాలు, దాడులు.. వంటి అనేక నేరపూరిత ఆరోపణలు(నిజాలేనని కొందరి వాదన) అనంతబాబుపై చాలా ఉన్నాయి.

అనంతబాబు తండ్రి అనంత చక్రరావుకు కూడా నేరచరిత్ర ఉంది. అమాయక గిరిజనులను తన బానిసలుగా చేసుకుని అధికారం చెలాయించేవాడని, అతని అరాచకాలను గమనించిని అప్పటి పీపుల్స్‌ వార్‌ నక్సల్స్‌ 1986లో కాల్చి చంపారని సమాచారం. తండ్రి ఆదివాసీ, తల్లి కాపు కావడంతో అనంతబాబు తాను షెడ్యూల్డ్‌ తెగలకు (ఎస్టీ లేదా ఆదివాసీ) చెందిన వ్యక్తినని చెప్పి జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. రంపచోడవరం,అడ్డతీగల ప్రాంతాలను తనకు అడ్డాగా చేసుకొని ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి తగ్గిపోయాక వీరప్పన్ గా అవతారమెత్తాడు. కలప స్మగ్లింగ్, అటవీ ఉత్పత్తుల ఎగుమతులు, రంగురాళ్ల వ్యాపారం ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. గతంలో ఆయనపై రౌడీషీట్ కూడా తెరిచారు పోలీసులు. కానీ మూడేళ్ల క్రితం ఆ రౌడీషీట్ ను ఎత్తేయించుకున్నాడు అనంతబాబు.

2014 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ వేశాడు. అయితే ఎస్టీ కాకపోవడంతో ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. వెంటనే వంతల రాజేశ్వరి అనే మహిళతో నామినేషన్ వేయించారు. ఆమె గెలిచాక ఆమె బదులు అనంతబాబే అధికారం చెలాయించేవాడు. ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ రంపచోడవరం తూర్పు ఏజెన్సీలో మొత్తం అనంతబాబు హవానే కొనసాగుతోందని, ప్రస్తుత ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి కూడా పేరుకే ఎమ్మెల్యే అని, అధికారాలు మొత్తం ఈయన చేతిలో ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైసీపీ తరఫున కాపు కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు.

కొత్తపల్లి గీత అరకు ఎంపీగా ఉన్న సమయంలో ఆమెపై దాడికి ప్రయ్నత్నించడంతో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు అనంతబాబు. ఇప్పుడు తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంకా వెలుగులోకి రాని విషయాల్లో ఎన్నో ఉంటాయని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.