2 లక్షలిస్తా.. శవాన్ని దహనం చెయ్యండి.. ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులు - MicTv.in - Telugu News
mictv telugu

2 లక్షలిస్తా.. శవాన్ని దహనం చెయ్యండి.. ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులు

June 1, 2022

మాజీ డ్రైవరు హత్య కేసులో కీలక నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రూపొందించిన రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న అనంతబాబుపై రూపొందించిన రిపోర్టును డీఎస్పీ కోర్టు ముందుంచారు. అందులో బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలు, నిందితుల వాంగ్మూలాన్ని తీసుకుని దర్యాప్తు చేసినట్టు తెలిపారు. హత్య జరగడం, తర్వాతి పరిణామాలను అందులో వివరించారు. రిపోర్టు ప్రకారం.. మే 19వ తేదీన అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేశాడు. ‘నీ కొడుకు నావద్ద 20 వేలు అప్పు చేశాడు. నా దగ్గర పని కూడా చేయడం లేదు. నా డబ్బులు ఇచ్చేయమని చెప్పు. లేదంటే కాలు, చెయ్యి తీసేస్తా’నని బెదిరించాడు. తర్వాత తన గురించిన రహస్యాులు ఎక్కడ బయటపెడతాడోననే ఆందోళనతో కొందరితో కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. మరణానికి కారణం అడిగితే ‘అదంతా నీకనవసరం. రెండు లక్షలిస్తా. శవాన్ని ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోండి. ఒక్కోసారి కొన్ని అలా జరుగుతుంటాయి’ అని చెప్పాడని మృతుడి సోదరుడు నవీన్ చెప్పాడు. భార్య అపర్ణ భర్త మరణం గురించి అడిగితే ‘ నేను చెప్పినట్టు చేయకపోతే నీ మరిదిని కూడా చంపుతాను’ అని బెదిరించాడు. ఈ లోగా బంధువులు అక్కడికి చేరుకోవడంతో శవాన్ని కారులో వదిలి పారిపోయాడని వెల్లడించింది. పై విషయాలను చూస్తే అనంతబాబే హత్య చేశాడని ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు.