మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టు, సుప్రీం కోర్టులే కాదు, జెనీవాలోని అంతర్జాతీయ కోర్టు కూడా విచారణ జరిపి తీర్పివ్వలేని పరిస్థితి! హంతకులు సమీప బంధువులే అని ఆరోపణలున్న నేపథ్యంలో అసలేం జరిగిందో ఎప్పటికైనా బయటికొస్తుందనేది అనుమానం. జగన్ ప్రభుత్వం ఈ కేసుపై సరిగ్గా దర్యాప్తు జరపకపోవడం, నిందితులు మాట మారస్తుండడం, కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలున్న ఎంపీ అవినాశ్ రెడ్డి పెదవి విప్పకపోవడంతో కేసు జటిలమైంది. శుక్రవారం ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరింత పీటముడి పడిపోయింది. వివేక హత్యకు రెండో పెళ్లే కారణమని, ఆయన ముస్లింను పెళ్లాడి, ముస్లిం పేరు పెట్టుకున్నాడని, రెండో పెళ్లి ద్వారా పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలనుకున్నారని అవినాశ్ చెప్పాడు. ఆస్తులన్నీ రెండో భార్యకు వెళ్తాయని అల్లుడు రాజశేఖరే హత్య చేయించాడని అన్నాడు. దీంతో ఇంతవరకు తెరచాటుగానే ఉన్న వివేక ‘రెండో పెళ్లి’ ప్రధానంగా చర్చకు వస్తోంది. మరి ఆయన నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నారా? చేసుకుని వుంటే వాళ్లెక్కడ ఉన్నారు; ఎందుకు నోరు విప్పవడం లేదు… వంటి ప్రశ్నలకు సమాధానలు దొరకవు.
ఒక కొడుకు ఒక కూతురు..
అవినాశ్ రెడ్డి చెప్పిన వివరాలు, మీడియాలో ఇదివరకు వచ్చిన కథనాలు, వివేక సన్నిహుతులు చెప్పిన వివరాల ప్రకారం.. వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్య, వీరి కూతురు సునీత. ఆయన 2010లో షేక్ షమీమ్ అనే ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారని ప్రచారంలో ఉంది. షమీమ్‌కు ఒక కొడుకు, తర్వాత ఒక కూతురు పుట్టారని చెప్తారు. కొడుకు 2015లో పుట్టాడట. వివేకానంద రెడ్డి చనిపోయే ముందు ఆయన ఫోన్‌కు షమీమ్ నాలుగు మెసేజీలు పంపారని, అందులో మూడు డిలీట్ అయ్యాయని ప్రచారంలో ఉంది. దర్యాప్తు సంస్థలు ఈ ‘రెండో పెళ్లి’ కోణాన్ని పట్టించుకోలేదని అవినాశ్ అంటున్నాడు. అసలు రెండో భార్య అని చెబుతున్న షమీమ్ ఎక్కడ ఉన్నారనేది సెద్ద సస్సెన్స్.
జగన్ ప్రభుత్వం ఊరుకుంటుందా?
వివేక హత్య వెనక ‘రెండో పెళ్లి’ కోణం నిజంగా ఉంటే, అధికారంలో ఉన్న జగన్ ప్రభుేత్వం ఆ ఆధారాలను బయటికి తీసి ఉండేదని ఒక వాదన. ఇన్నేళ్లుగా ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు జరపలేదన్నది ఆసక్తికరం. సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసి, అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయబోయే అవకాశమున్న ప్రస్తుత తరుణంలోనే రెండో పెళ్లి గురించి ఎందుకు ప్రధానంగా తెరపైకి తెస్తున్నారు? హత్య జరిగి ఐదేళ్లవుతున్నా షమీమ్ వివరాలు బయటికి రాలేకపోవడానికి ఎవరు కారణం? ఇవన్నీ భేతాళ ప్రశ్నలే. షమీమ్‌తో పెళ్లి నిజమో కాదో పక్కన బెడితే మీడియాలో వివేక ఒక మహిళ పక్కన సంతోషంగా ఉన్న ఫొటోలు కొన్ని చాలా రోజులుగా తిరుగుతున్నాయి. ఆ ఫొటోల్లోని మహిళే రెండో భార్య అని, పిల్లలు వారి కూతురు, కొడుకేనని చెబుతున్నారు. అయితే వైఎస్ భార్య సౌభాగ్య, కూతురు సునీత ఈ విషయంపై స్పందించడం లేదు. అవినాశ్ రెడ్డి చెబుతున్నట్లు వివేకకు ‘రెండో భార్య’తో పుట్టిన కొడుక్కి ఇప్పుడు ఎనిమిదేళ్లు ఉండొచ్చు. ఆయన 2019లో చనిపోయాడు. పిల్లాడేమో 2015 పుట్టాడట. అంటే అప్పటికి వాడికి నాలుగేళ్లు. నాలుగేళ్ల పిల్లాడిని వివేక ఏ విధంగా రాజకీయ నాయకుడిని చేయాలనుకున్నారు, అసలు వివేకాకు అంత బలమైన రాజకీయ వారసత్వం ఉండిందా అన్న ప్రశ్నలకు జవాబులు ఉండవు. ఆస్తుల కోసమే రాజశేఖర్ చంపించి వుంటే వివేకకు ఎన్నికోట్ల ఆస్తులున్నాయనేది బయటికి రావాలి. ఈ ప్రశ్నలకు, అనుమానాలకు జవాబులు శూన్యం. వెరసి ఈ కేసు మరో పదేళ్లు, లేకపోతే ఇరవయ్యేళ్లు కోర్టులో నానుతుంది!