వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆయన ఇంటి వద్ద ఇది జరిగింది. దీంతో వెంటనే అతన్ని గన్మెన్లు దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనలో ఎంపీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు ఉద్ధండరాయునిపాలెంలోని ఎంపీ సురేశ్ ఇంటి వద్దకు వచ్చాడు. అప్పటికే పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన ఎంపీ లోపలికి వెళ్తున్న సమయంలో ఇనుపరాడ్డుతో దూసుకువచ్చాడు. దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. వెంటనే గన్మెన్లు అప్రమత్తం కావడంతో పారిపోతుండగా.. వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత పూర్ణచంద్రరావు నుంచి రాడ్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నాయకుల కుట్ర అంటూ అనుమానిస్తున్నారు.