నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఇదే రోజున ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘నన్ను నిల్చోడానికి కూడా వీలు లేనంతగా గుండెలపై విపరీతంగా కొట్టారు. సెల్ ఫోన్ కోసం వెతికి మరో సారి కొట్టారు. మొత్తంగా ఐదు సార్లు తీవ్రంగా కొట్టారు. అనంతరం ఓ కానిస్టేబుల్ వచ్చి ఏం జరిగింది.. ఎవరు కొట్టారు అని అమాయకంగా అడిగాడు.
మరో పోలీసు నన్ను లేసి మంచంపై పడుకోబెట్టాడు. ఉన్మాదంగా ప్రవర్తించడంలో సీఎం జగన్, సునీల్ ఇద్దరూ అద్భుత కళాకారులు. ఇది నా 60వ పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకున్నా. కానీ, 59వ పుట్టిన రోజును మరింత ఘనంగా జరిపిన ఉన్మాది జగన్కు ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు బుద్ది చెపుతారు’ అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ పర్యటన తర్వాత హొంమంత్రి అమిత్ షాను కలవనున్నట్టు రఘురామ వెల్లడించారు. ఆయన తనతో ఫోన్లో మాట్లాడి బర్త్డే విషెస్ చెప్పారని వివరించారు.