నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీలో వచ్చే ఎన్నికలపై సర్వే నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ – జనసేన కూటమి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని సర్వే ఆధారంగా పేర్కొన్నారు. వై నాట్ 175 అని ప్రగల్భాలు పలుకుతున్న తమ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వస్తుందని ఎలా అంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. అబద్దాలు ఆడే వైసీపీకి దారుణ ఓటమి తప్పదని, ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే అర్ధమవుతోందని జోస్యం చెప్పారు. ఒక్క అవకాశమే కదా అని ఇచ్చి చూసిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ – జనసేన కూటమికి 12 నుంచి 14 శాతం మెజార్టీ వస్తుందని, ఈ రెండు పార్టీలు కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్టేనని అభిప్రాయపడ్డారు. అంతేకాక ప్రాంతాల వారీగా సర్వే ఫలితాలను వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 10 నుంచి 12 శాతం, గోదావరి జిల్లాల్లో 14 నుంచి 16 శాతం, అనంతపురం, కర్నూలులో 10 నుంచి 12 శాతం, చిత్తూరు, కడపలలో 6 నుంచి 8 శాతం, ఒంగోలు, నెల్లూరులో 8 నుంచి 10 శాతం, గుంటూరు, కృష్ణాలలో 12 నుంచి 14 శాతం ఎడ్జ్ ఉందని తెలిపారు. చెప్పినవే కాక చెప్పనవి కూడా అమలు చేశామని చెప్తున్న తమ పార్టీ చెత్తపన్ను వేస్తామని చెప్పకుండా వేసిందని ఎద్దేవా చేశారు. ఆస్తిపన్ను, కరెంటు చార్జీలను కూడా ఇదే విధంగా పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదని విమర్శించారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను వివరిస్తానని ప్రకటించారు.