హైదరాబాద్ మోకిలలోని తారకరత్న నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. తారకరత్న పార్థీవదేహాన్ని చూసి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. తారకరత్న కుమార్తె ఎక్కిఎక్కి ఏడవడం కంటతడి పెట్టిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ తారకరత్న నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు నివాళులర్పించారు. తారకరత్న పార్థీవదేహం చూసిన కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లు భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులర్పించి అక్కడే నివాసం ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు.తారకరత్న పార్థివదేహానికి చంద్రబాబు నివాళులర్పించిన అనంతరం ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందిన వైద్య సేవలతో పాటు, అంత్యక్రియలకు సంబంధించిన ఇతర విషయాలపై చర్చించారు. అంతకుముందు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో విజయసాయి రెడ్డి మాట్లాడారు.
విజయసాయిరెడ్డి, తారకరత్నకు అల్లుడు వరస అవుతారు. విజయసాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్యను తారకరత్న వివాహం చేసుకున్నారు. తారకరత్న-అలేఖ్య ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా విజయసాయి రెడ్డి మాత్రం అండగా నిలిచారు. తారకరత్న ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా విజయసాయి రెడ్డి వెళ్లి పరామర్శించారు. దగ్గరుండి తారకరత్న ఆరోగ్యపరిస్థితి చూసుకుంటున్న బాలకృష్ణకు కూడా ధన్యవాదాలు తెలిపారు.