ఏ మంత్రం వేసావే..మహిమ తక్కువే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏ మంత్రం వేసావే..మహిమ తక్కువే..

March 9, 2018

‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ విజ‌యాల‌తో తెలుగులో స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నాడు. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. ముఖ్యంగా యువ‌త‌లో అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ సినిమాల్లో ఆయ‌న స‌హ‌జ అభినయానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి.  అతనితో సినిమాలు చేయ‌డానికి అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సైతం ఆస‌క్తిని చూపుతున్నారు. ఈ త‌రుణంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ మూడేళ్ల క్రితం అంగీక‌రించిన ‘ఏ  మంత్రం వేసావే’ చిత్రం అనేక అవాంత‌రాల‌ను దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. విజ‌య్ సైతం ఆశ‌లు వ‌దులుకున్న ఈ సినిమాను కేవ‌లం అత‌డికి ఉన్న ఇమేజ్‌ను ఉప‌యోగించుకొని  విజ‌య‌వంతం చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావించారు. అయితే వారి ప్ర‌య‌త్నాలు మాత్రం ఫ‌లించ‌లేదు.

నిఖిల్ ఆనంద్ అలియాస్ నిక్కీ వీడియోగేమ్స్‌, సోష‌ల్‌మీడియానే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ బ‌య‌టి ప్ర‌పంచానికి పూర్తిగా దూర‌మైపోతాడు. అమ్మాయిలు అంటే ఆట‌వ‌స్తువులు మాత్ర‌మే అన్న‌ది అత‌డి అభిప్రాయం. ఇద్ద‌రు మిత్రుల‌తో క‌లిసి రోజుల త‌ర‌బ‌డి వీడియో గేమ్స్ అడుకుంటూ ఇంటికే ప‌రిమిత‌మైపోతాడు. రాగ‌మాలిక ఓ వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్‌. బ‌య‌టి ప్ర‌పంచంలోనే ఎన్నో అద్భుతాలు ఇమిడి ఉన్నాయ‌న్న‌ది ఆమె సిద్ధాంతం. త‌న మిత్రులంతా సోష‌ల్‌మీడియాలో ప‌డి మోస‌పోతుంటే త‌న మాత్రం వాటికి దూరంగా ఉంటుంది. త‌న చిరునామా ఏమిటో ఎవ‌రికీ చెప్ప‌దు. ఓ సంద‌ర్భంలో ఆన్‌లైన్‌లో రాగ‌మాలిక‌ను చూసిన విక్కీ ఆమె త‌న ప్రేమ‌లోకి దించుతాన‌ని  స్నేహితుల‌తో ఛాలెంజ్ చేస్తాడు. అయితే రాగ‌మాలిక మాత్రం త‌న పేరు, చిరునామా చెప్ప‌కుండా విక్కీని ఆట‌ప‌ట్టిస్తుంటుంది. గేమ్ మాదిరిగానే తానెవ‌రో కొన్ని క్లూల‌ను ఇస్తూ క‌నుక్కోమని చెబుతుంటుంది. దాంతో ఆమె కోసం అన్వేష‌ణ  మొద‌లుపెడ‌తాడు విక్కీ. ఈ క్ర‌మంలో రాగ‌మాలిక కొంద‌రి వ‌ల్ల ప్ర‌మాదంలో ఉంద‌నే నిజం అత‌డికి తెలుస్తుంది. ఆమెకు కాపాడే ప్ర‌య‌త్నంలో సిటీలో అమ్మాయిల‌ను అక్ర‌మంగా అమ్ముతున్న ఓ ముఠా గుట్టును ర‌ట్టు చేస్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది రాగ‌మాలిక‌ ఎవ‌రో విక్కీ ఎలా తెలుసుకున్నాడు? అత‌డితో రాగ‌మాలిక ఆ గేమ్ ఎందుకు ఆడించింది? అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.ప్ర‌స్తుతం యువ‌త‌రం మొత్తం సోష‌ల్‌మీడియాకు బానిస‌లుగా మారిపోతున్నారు. కంటికి ఎదురుగా క‌నిపించే ఆప్తుల‌ను ప‌క్క‌న‌పెట్టి సామాజిక  మాధ్య‌మాల్లో అప‌రిచితుల‌తో స్నే హాల‌ను కొన‌సాగిస్తూ మోస‌పోతున్నారు. సోష‌ల్‌మీడియా వ‌ల‌లో ప‌డి అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌కు దూర‌ం అవుతున్నారు.  జీవ‌న‌ మాధుర్యాన్ని కోల్పోతూ  ర‌క్త‌పాతంతో కూడిన గేమ్‌ల కార‌ణంగా హింస‌ప్ర‌వృత్తికి అల‌వాటుప‌డుతున్నారనే సందేశాత్మ‌క క‌థాంశంతో ద‌ర్శ‌క‌నిర్మాత శ్రీ‌ద‌ర్ మ‌ర్రి ఈ సినిమాను తెర‌కెక్కించారు.న‌వ‌త‌రం మ‌నోభావాల‌ను, ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు య‌థార్థ సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ప్రేమ‌, థ్రిల్ల‌ర్ అంశాల‌ను మిళితం చేస్తూ సినిమాను రూపొందించారు. అత‌డు ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, అనుభ‌వ‌లేమి, తాను చెప్ప‌ద‌లుచుకున్న అంశాల్లో క్లారిటీ లోపించ‌డంతో సినిమా ప్రేక్ష‌కుల ఓపిక‌కు ప‌రీక్ష‌గా నిలిచింది. క‌థ‌లో ఎక్క‌డ స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. వీడియో గేమ్‌లంటూ మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత ప్రేమ‌, అమ్మాయి ట్రాఫికింగ్ అంటూ ఏవోవో చూపిస్తూ వెళ్లారు. హీరోయిన్ ప్ర‌మాదంలో ఉందంటూ చూపిస్తూ చివ‌ర‌కు అదంతా డ్రామా అని చెప్ప‌డం చాలా హాస్య‌ాస్ప‌దంగా ఉంది. దానికి తోడు విజ‌య్ దేవ‌ర‌కొండ మిన‌హా మిగ‌తా న‌టీన‌టులంతా కొత్త‌వారు కావ‌డం సినిమా మైన‌స్‌గా మారింది.

లఘు చిత్రానికి స‌రిపోయే క‌థ‌ను తీసుకుని దానిని సినిమాగా మ‌లచాల‌ని అనుకుంటే ఎలా ఉంటుందో ఈసినిమా అదే రీతినా సాగుతుంది. ఆద్యంతం సాగ‌తీత‌గా ఉంటుంది. పాత్ర‌లు తెర‌పైక‌నిపిస్తున్నా క‌థ ఎంత‌కు ముందుకు సాగ‌ని అనుభూతి క‌లుగుతుంది.  నిర్మాణ విలువ‌లు, సాంకేతిక ప్ర‌మాణాలు అన్ని నాసిర‌కంగా ఉన్నాయి.

క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా క‌థ‌నాన్ని ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. పేరుకే థ్రిల్ల‌ర్ సినిమా అయినా ప్రేక్ష‌కుల్ని ఉత్కంఠ‌కు లోనుచేసే స‌న్నివేశం ఒక్క‌టి సినిమాలో క‌నిపించ‌దు. హీరోయిన్ ఆచూకీని హీరో క‌నిపెట్టే స‌న్నివేశాలు, సోష‌ల్‌మీడియాను అడ్డుపెట్టుకొని అమ్మాయిల్ని మోసం చేస్తున్న ముఠాను హీరో, అత‌డి మిత్రుల‌తో క‌లిసి ప‌ట్టుకునే స‌న్నివేశాలు చాలా సాదాసీదాగా ఉన్నాయి. వాటిని పక‌డ్బందీగా అల్లుకుంటే మంచి ప్ర‌య‌త్నంగానైనా నిలిచేది.

కేవ‌లం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు  ప్ర‌స్తుతం ఉన్న పేరుప్ర‌ఖ్యాతుల్ని క్యాష్ చేసుకోవ‌డాకే విడుద‌ల చేసిన సినిమా ఇది. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా క‌థాంశాల‌తో మారుతి, సునీల్‌కుమార్‌రెడ్డి వంటి ద‌ర్శ‌కులు ప‌లు సినిమాల్ని రూపొందించారు. వాటి త‌ర‌హాలోనే ఈ సినిమా సాగుతుంది.

పెళ్లిచూపులు సినిమాకు ముందు విజ‌య్్ దేవ‌ర‌కొండ అంగీక‌రించిన చిత్ర‌మిది. అత‌డి పాత్ర‌, ఆహార్యం అన్ని అప్ప‌టి ఛాయలతోనే సాతాయి. త‌న న‌ట‌న‌తో సినిమాను నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేసిన క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో కుద‌ర‌లేదు. హీరోయిన్‌గా శివానీసింగ్ అభిన‌యాన్ని గురించి చెప్పుకోవ‌డానికి ఏమీలేదు. స‌న్నివేశాల‌కు ఆమె ప‌లికించే భావాల‌కు ఎక్క‌డ పొంత‌న కుద‌ర‌దు. ఉన్నంతంలో హీరో మిత్రులుగా క‌నిపించిన ఇద్ద‌రే ఒక‌టి రెండు చోట్ల న‌వ్వించారు.

సాంకేతికంగా సినిమాలో చెప్పుకోవ‌డానికి ఏమీలేదు. క‌థ‌, క‌థ‌నం, నిర్మాణం, ద‌ర్శ‌క‌త్వం అన్ని బాధ్య‌త‌ల్ని తానే చేప‌ట్టిన శ్రీ‌ధర్ మ‌ర్రి అన్నింటిలో విఫ‌ల‌య్యారు. ఏ ఒక్క విభాగానికి న్యాయం చేయ‌లేక‌పోయారు. ఛాయాగ్ర‌హణం,సంగీతం ఏదీ మెప్పించ‌లేక‌పోయింది.

ఏ మంత్రం వేసావే పేరులోనే త‌ప్ప సినిమాలో ఎక్క‌డా ఆహ్లాదం క‌నిపించ‌దు. విజయ్ దేవ‌ర‌కొండ పేరు చూసి సినిమా థియేట‌ర్‌లో అడుగుపెట్టిన ప్రేక్ష‌కుడిని ప్ర‌తి క్ష‌ణం అస‌హ‌నానికి గురిచేస్తూనే ఉంటుంది. తెర‌పై ఏం జ‌రుగుతుందో,ద‌ర్శ‌కుడు ఏం చెబుతున్నాడో ఓ ప‌ట్టాన అర్థంకాదు. ఇన్నాళ్లు  థియేట‌ర్ల బంద్‌తో  వినోదానికి దూర‌మైన ప్రేక్ష‌కులు స‌ర‌దాగా రెండు గంట‌ల పాటు న‌వ్వుకోవాల‌నే ప్ర‌య‌త్నంతో ఈ చిత్రానికి వ‌స్తే మాత్రం నిరాశ‌ప‌డ‌క‌త‌ప్ప‌దు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా నిర్మాత‌కు వ‌ర్క‌వుట్ కావ‌డం క‌ష్ట‌మే.

రేటింగ్‌:2/5