ఆ రైల్వే స్టేషన్‌ ఆదాయం రూ.20 మాత్రమే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ రైల్వే స్టేషన్‌ ఆదాయం రూ.20 మాత్రమే..

January 17, 2020

railway station.

ఆ రైల్వేస్టేషన్‌కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే. అందులో ఎప్పుడు చూసినా ఇద్దరే ప్రయాణికులు ఉంటారు. నమ్మశక్యం కాని ఈ రైల్వేస్టేషన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏడాది క్రితం ప్రారంభమైంది. ఇది ఒడిశాలోని బొలంగిర్ జిల్లాలో బిచ్చుపాలిలో ఉంది.  దాదాపు రూ.115 కోట్లతో ఈ రైల్వేలైన్ నిర్మించారు. గతేడాది జనవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి బొలాంగిర్ – బిచ్చుపాలి మధ్య 16.8 కిలోమీటర్ల మేర నిర్మితమైన ఈ స్టేషన్‌కు వస్తున్న ఆదాయం కేవలం రూ.20 మాత్రమే. 

ఎప్పుడు చూసినా ఒకరిద్దరు మాత్రమే ఉండే ఈ స్టేషన్ గురించి బొలాంగిర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత పాండ సహచట్టాన్ని ఆశ్రయించారు. ‘మీరు పరిశీలించింది నిజమే. ఇద్దరే ప్రయాణికులు వస్తున్నారు. వారి ద్వారా ఈ స్టేషన్‌కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే’ అని సంబల్‌పూర్ డివిజన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే సమాధానం చెప్పింది. అయితే వారు రైల్వేస్టేషన్ నిర్వహణ ఖర్చులు మాత్రం చెప్పలేదు. ఈ విషయమై మరో ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి జేపీ మిశ్రా స్పందించారు. సోనేపూర్ రైల్వేలైన్‌కు దీన్ని కనెక్ట్ చేస్తే ఈ స్టేషన్‌కు ఆదాయం పెరుగుతుందని తెలిపారు.