పాపం కాంగ్రెస్.. కారెక్కనున్న మరో ఎమ్మెల్యే! - MicTv.in - Telugu News
mictv telugu

పాపం కాంగ్రెస్.. కారెక్కనున్న మరో ఎమ్మెల్యే!

March 14, 2019

టీకాంగ్రెస్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు దెబ్బమీద దెబ్బ కొడుతున్నారు. ఇటీవల జరిగి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లో గెలుపొందింది. అందులో ఆరుగురు ఎమ్మల్యేలు ఇప్పటికే గులాబీ గూటికి చేరుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు కసరత్తు చేసుకుంటున్నారు.

Yellareddy Congress MLA Jajula Surender Joining Into TRS Party Soon.

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖారారు చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19వ తేదీన సీఎం కేసీఆర్ నిజామా‌బాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు టీఆర్‌ఎస్‌లో చేరతామని ప్రకటించగా.. గురువారం పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కేటీఆర్‌తో భేటీ అయి టీఆర్ఎస్‌లో వెళ్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన అనంతరం గులాబీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సురేందర్ కూడా వలస బాట పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు గురవుతోంది. కాంగ్రెస్ నుంచి ఇలాగే వలసలు కొనసాగితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనుంది.