Yellow warning in Hyderabad, rains expected across Telangana over next two days
mictv telugu

రెండ్రోజుల పాటు భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్

September 20, 2022

తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం ఓ ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీంతో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

సాయంత్రం, రాత్రి సమయాల్లోనే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. ఈ క్రమంలో రాబోయే రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో, ఆ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.