తెలుగులో తొలి భారీ బడ్జెట్ చిత్రమిదే! - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగులో తొలి భారీ బడ్జెట్ చిత్రమిదే!

October 23, 2017

తమిళసినీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘2.0’ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితం అవుతోంది. దీని బడ్జెట్ రూ. 450 కోట్లు. దీని వ్యవహారం చూస్తోంటే రాజమౌళి బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టాలనే కసి కనిపిస్తోంది.

అయితే మనం అందరం అనుకుంటున్నట్టు తెలుగులో తొలిసారి భారీ బడ్జెట్ తీసింది రాజమౌళి కాదు..  సి.పుల్లయ్య. 1933లో విడుదలయిన ఆ చిత్రం పేరు ‘సతీ సావిత్రి’. దాని బడ్జెట్ అప్పట్లోనే 75,000. యిది తెలుగులోనే కాదు భారతదేశం మొత్తం మీద అధికారికంగా నమోదయిన తొలి భారీ బడ్జెట్ చిత్రం యిది. తొలి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కూడా అదే. ఈ చిత్రాన్ని ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించింది.

దీనికి పోటీగా 1933లోనే మరో తెలుగు దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో భారత్ మూవీటోన్ అనే మరో చిత్రనర్మాణ సంస్థ యిదే సావిత్రి సత్యవంతుల యితివృత్తంతో ఓ సినిమా విడుదల చేసింది. అయితే అది బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.

సి.పుల్లయ్య స్వతహాగా నాటకాల నుండి వచ్చిన వాడు.  రఘుపతి వెంకయ్యనాయుడి కుమారుడు ప్రకాశ్‌కు అసిస్టెంట్ గా పనిచేసి మూకీ చిత్రనిర్మాణంలో మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తనే మూకీ చిత్రానికి దర్శకత్వం వహించాడు.  కాకినాడలో టెంట్ థియేటర్ స్థాపించి సినిమా ప్రదర్శనలు మొదలెట్టిన అనుభవం వున్న వాడు.

ఆ తర్వాత టాకీస్ రావటంతో కలకత్తా వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీ సాయంతో ‘సతీ లీలావతి’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా యిదే అతని తొలిచిత్రం. నిజానికి సతీ లీలావతి అప్పటికే తెలుగు నాట ప్రాచుర్యం పొందిన ఓ నాటకం. మైలవరం బాలభారతి నాటక సమాజం దీన్ని ప్రదర్శిస్తూ వుండేది. అదే నాటకాన్ని సి.పుల్లయ్య సినిమాగా తీశాడు. నాటకంలో యముడి పాత్రను పోషించిన వేమూరి గగ్గయ్యనే విలన్ వేషానికి ఎంచుకున్నాడు. ఈ చిత్రంతో “పోపోవేల పొమ్మికన్’ అంటూ పాడుతూ నటించిన వేమూరి గగ్గయ్య తెలుగులో స్టార్ వాల్యూ తెచ్చుకున్న తొలి విలన్‌గా చరిత్ర సృష్టించాడు. సావిత్రి పాత్రను దాసరి రమాతిలకం పోషించింది. ఈ చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గౌరవ పురస్కారం కూడా దక్కించుకుంది.