కవిత యోగా.. పతంజలి కేంద్రం దక్కేనా? - MicTv.in - Telugu News
mictv telugu

కవిత యోగా.. పతంజలి కేంద్రం దక్కేనా?

April 10, 2018

యోగా.. ఒకప్పుడు మనదేశానికే పరిమితం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా యోగాసనాలు వేస్తోంది. ఆరోగ్యం కోసం, శారీరక దృఢత్వం కోసం భారతీ సంప్రదాయ వ్యాయామం బాట పట్టింది. టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత కూడా యోగాను అనుసరిస్తున్నారు. రిజర్వేషన్లపై రాష్ర్టాలకు హక్కు కోసం పార్లమెంటులో ఆందోళన, విపక్షాలపై విమర్శలతో నిన్నమొన్నటివరకు బిజీగా ఉన్న ఆమె కాస్త తీరిక చేసుకున్నారు.

యోగా ప్రచారానికి కృషి చేస్తున్న ఆధ్యాత్మిక గురురు బాబా రాందేవ్ ప్రస్తుతం నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన ఉచిత యోగ, ధ్యాన శిక్షణ శిబిరంలో ఆయన ప్రజలకు యోగాసనాలు నేర్పించారు. వేదికపై కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా బాబా సారథ్యంలో యోగా చేశారు. ఈ శిక్షణా శిబిరం మూడురోజులు ఉంటుంది. యోగాతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని బాబా చెప్పారు. కాగా, రాందేవ్ కు చెందిన పతంజలి కంపెనీకి సంబంధించిన ఒక ఆహారశుద్ధి కేంద్రాన్ని లాక్కంపల్లిలో ఏర్పాటు చేయించేందుకు కవిత చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఆమె ఇదివరకు ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన నిజామాబాద్ రావడంతో మళ్లీ దీనిపై చర్చించనున్నారు. రాందేవ్ అనుగ్రహితే లాక్కంపల్లిలో పతంజలి కేంద్రం ఏర్పాటై, స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయి.