100 ఏళ్ల యోగా బామ్మ వెళ్లిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

100 ఏళ్ల యోగా బామ్మ వెళ్లిపోయింది..

October 26, 2019

Yoga teacher nanammal passed away 

వయసు శరీరానికే గాని మనసు కాదని నిరూపించి, వందేళ్ల వయసులోనూ ఉరకలెత్తే ఉత్సాహంతో జీవితాన్ని సార్థకం చేసుకున్న యోగా బామ్మ కన్నుమూశారు. దేశంలో అత్యధిక వయసున్న మహిళా యోగా గురువుగా పేరొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నానామ్మాళ్ ఈ రోజు కోయంబత్తూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు వందేళ్లు. 

అన్నేళ్ల వయసున్నా తన పనులు తాను చేసుకోవడమే కాకుండా, పలువురికి యోగా నేర్పుతున్న నానమ్మాళ్ మరణం యోగా ప్రపంచంలో విషాద ఛాయలు నింపింది. ఆమె ఇప్పటివరకు వేలమందికి యోగా నేర్పారు. తండ్రి నుంచి యోగాను వారసత్వంగా అందుకున్న ఆమె ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. పొద్దున లేవగానే అరలీటరు నీళ్లు తాగేవారు. వేపపుల్లతో పళ్లు తోముకునే వారు.  పాలు, తేనె, పళ్లు, ఇడ్లీ, సాంబారు వంటి ఆహరం తీసుకునేవారు. భర్త ప్రోత్సాహంతో పెళ్లయినా యోగా కొనసాగించారు. ఒకే సెషన్‌లో 20 వేల మందికి యోగా నేర్పి చరిత్ర సృష్టించారు. 1920లో జన్మించిన నానమ్మాళ్ పదేళ్ల వయసులో యోగా ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా యోగా చేస్తున్నారు. ఆమె మొత్తం 50 యోగాసనాలు వేసేవారు. చీరకట్టుతో యోగాసనాలు వేయడం ఆమె ప్రత్యేకత. యోగాకు నానమ్మాళ్ చేసిన సేవలకు గుర్తింపుగా గత ఏడాది ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ  అవార్డుతో సత్కరించింది. నారీశక్తి పురస్కార్, యోగరత్న వంటి మరెన్నో అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి.