రామ్‌జీ లేకుంటే అంబేడ్కర్ పేరును మార్చేవారా! - MicTv.in - Telugu News
mictv telugu

రామ్‌జీ లేకుంటే అంబేడ్కర్ పేరును మార్చేవారా!

March 29, 2018

కాదేదీ కవిత్వానికి అనర్హం అని అన్నాడో కవి. కవిత్వం సంగతేమోగాని, మన దేశంలో రాజకీయాలు చేయడానికి ఏదీ అనర్హం కాదు. చివరకు జాతిని నడిపించి చరిత్రకెక్కిన మహానుభావుల పేర్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న ఘనభారతం మనది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేరు ఇకపై భీం రావ్‌ రామ్‌జీ అంబేద్కర్‌’ అని రాయాలని, పాత, కొత్త అధికార పత్రాల్లో ఈమేరకు మార్పులు చేయాలని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిర్ణయం తీసుకుంది. యూపీ గవర్నర్‌ ‘రామ్’ నాయక్‌ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ తన రాముడి పేరును అంబేడ్కర్‌పై రుద్దుతోందని మండిపడుతున్నారు.  

పేరులో ఉన్నదే.. కానీ.. వారి పేర్లూ..

అంబేడ్కర్ అసలు పేరు భీమ్ రావ్ రామ్‌జీ అంబేడ్కర్. రామ్జీ అనేది అయన తండ్రి పేరు. అయితే అంబేడ్కర్ బీఆర్ అంబేడ్కర్ అనే సంతకం చేసేవారు. జనంలో కూడా అదే వాడుకలో ఉంది. స్కూలు పుస్తకాల్లో, ఫైళ్లలోనూ అదే ఉంది. ఒక్క అంబేడ్కరే కాదు, చాలామంది జాతీయ నాయకుల పేర్లను వాడుకలో ఉన్నట్లే రాసుకుంటున్నా. మహాత్మాగాంధీ అంటున్నారేగాని మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనడం లేదు. వల్లభభాయ్ జావేర్ భాయ్ పటేల్ అని కాకుండా వల్లభభాయ్ పటేల్ అనే రాస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పఠనం, రాత సౌలభ్యం కోసం ఇలా అనుసరిస్తున్నారు. వారి పేర్లను పూర్తిగా రాయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆదేశాలు జారీ చేసిన దాఖలా లేదు.

ఉద్దేశం మంచిదే అయినా..

Image result for YOGI

అంబేడ్కర్ పేరును తప్పుగా పలుకుతున్నారన్న వాదన చాలా రోజుల నుంచీ ఉన్నదే. మరాఠీలో ఆయన పేరు ఎలా పలకాలో తెలియక చాలా రాష్ట్రాలో ‘అంబేద్కర్’ అని అంటున్నారు. ఇలాంటి పొరపాట్లు సహజమే. అన్ని విషయాలూ అందరికీ తెలియాలనే రూలేమీ లేదు. అయితే అంబేడ్కర్ పేరులో రామ్‌జీ పదంపైనే యోగి పట్టుపట్టడం అనుమానాలకు తావిస్తోందని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. రామ్‌జీ కాకుండా ఆ పదం బదులు వేరే పేరు ఉంటే ఈ మార్పుచేర్పు ఉండేది కాదని, యోగి సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఈ మార్పు చేసిందని ఆరోపిస్తున్నారు. జాతినేతల పేర్లను ఉన్నవి ఉన్నట్లు పలకాలనే ఉద్దేశం మంచిదే అని, అయితే  గాంధీ, వల్లభాయ్ వంటి అందరి పేర్లనూ మారుస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు..!