కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా.. ఎస్బిఐ సరికొత్త ఆవిష్కరణ - MicTv.in - Telugu News
mictv telugu

కార్డు లేకుండా క్యాష్ విత్ డ్రా.. ఎస్బిఐ సరికొత్త ఆవిష్కరణ

March 16, 2019

భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఖాతాదారులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్న ఎస్బిఐ మరో ముందడుగు వేసింది. ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనోపై కొత్తగా ‘యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయంతో దేశవ్యాప్తంగా 16,500కు పైగా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.

YONO Cash: Now, SBI customers can withdraw cash without ATM cards

దేశంలో ఇటువంటి సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తొలి బ్యాంకుగా ఎస్‌బీఐ అవతరించింది. యోనో క్యాష్ సదుపాయం ఉన్న ఏటీఎంలను ‘యోనో క్యాష్ పాయింట్’గా వ్యవహరించనున్నారు. వినియోగదారులు ఈ యోనో క్యాష్ పాయింట్‌లోకి వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్‌డ్రాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్‌సెట్ చేసుకోవాలి. అనంతరం ఖాతాదారుడి మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నంబరును ఎంటర్ చేయడం ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పని 30 నిమిషాల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.