కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. టీవీలో సబ్బు బ్రాండ్లు గీత, దోరెసాని ప్రకటనల్లో నటించిన యువ నటి చేతన (21 ఏళ్లు), అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల చేతన రాజ్ ఫ్యాట్ ఫ్రీ సర్జరీకి మే 16న ఉదయం శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. సాయంత్రం సమయానికి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం మొదలైంది. దాంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది. తమవంతు ప్రయత్నాలు చేశాము. అయినా, ఫలితం దక్కలేదు.
మరోపక్క ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చేతన.. తన తల్లిదండ్రులకు చెప్పకుండా, స్నేహితులతో కలసి ఆమె ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె అకాల మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని రామయ్య హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.