కరీంనగర్‌లో కుల దాడి.. దళితుణ్ని దారుణంగా.. - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్‌లో కుల దాడి.. దళితుణ్ని దారుణంగా..

October 3, 2018

ప్రేమించడమే పాపమవుతోంది. కలసి జీవించాలనుకోవడం నేరమవుతోంది. కుల పిచ్చితో పెద్దలు దారుణాలకు తెగబడుతున్నారు. మొన్న మిర్యాలగూడ ప్రణయ్ హత్య, హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లో జరిగిన ఘటనలు మరువకముందే.. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఆధిపత్యకుల అమ్మాయిని ప్రేమించిన ఓ దళిత యువకుడిపై 25మంది విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్ సప్తగిరి కాలనీలో చోటుచేసుకుంది.

tt

జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన సాయి, ఒగులాపూర్‌కు చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇరుకుటుంబాలకు తెలియడంతో పెద్దలు హెచ్చరించారు. అయితే మూడు రోజుల క్రితం అమ్మాయితో సాయి ఫోన్ మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న యువతి తరపు బంధువులు సాయిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. సప్తగిరి కాలనీలో కాపుకాసి సాయిపై దాదాపు 25మంది దాడిచేశారు. విచక్షణ రహితంగా కొట్టి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు సాయిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.