మీ వద్ద కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఫోన్ పేతో మీకు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా.? అయితే తస్మాత్ జాగ్రత్త. నకిలీ ఫోన్ పే తో డబ్బు చెల్లించినట్లు చూపించి మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు. ఈ తరహ మోసం ఏపీలోని కృష్ణా , పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలోనూ చోటుచేసుకుంది. ఈ మోసాలకు పాల్పడింది ఒకే ఒక్కడు కావడం గమనార్హం.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన అల్లూరి అరవింద్ అనే యువకుడు… ఖాతా బుక్ నే నకిలీ ఫోన్ పే గా మార్చుకొని లక్షల రూపాయల మేర మోసం కాజేశాడు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని నల్లజర్ల, గంపలగూడెం, తాడేపల్లిగూడెం, కుక్కునూరు, తాళ్లపూడి తదితర పట్టణాల్లోని బంగారం షాపులకు వెళ్లి.. ఫ్రెండ్ పెళ్లికి గిఫ్ట్స్ ఇవ్వాలంటూ ఉంగరాలు, బ్రాస్లెట్లు అడుగుతాడు. ఆ తర్వాత ఆభరణాలు కొనుగోలు చేసి నకిలీ ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేసి మోసం చేస్తాడు.
అయితే నల్లజర్లలో ఇదే తరహ మోసానికి పాల్పడడంతో సదరు గోల్డ్షాపు యజమానికి యువకుడిపై అనుమానం వచ్చి అభరణాలు ఇచ్చేటప్పుడు తన మొబైల్లో ఫొటో తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయామని గ్రహించాడు. వెంటనే అరవింద్ ఫోటోను పలు వాట్సప్ గ్రూపుల్లో పెట్టి.. ఈ వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే మాకు తెలియచేయగలరని పోస్ట్ చేయడంతో ఆ కేటుగాడి బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.