ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం స్నేహితులతో కలసి ఓ వ్యక్తి షటిల్ ఆడుతున్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి.. చిలకలూరిపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లెల బుచ్చయ్య మనవడు (కుమార్తె కుమారుడు), మల్లెల సత్యనారాయణ మేనల్లుడు బేతంచర్ల కిషోర్ (34) గా తెలిసింది. చిలకలూరిపేటలో ఉన్న ఓ క్లబ్ లో షటిల్ ఆడేందుకు నిన్న ఉదయం వెళ్లాడు. స్నేహితులతో కలసి ఆడుకుంటుండగా 9:30 గంటల సమయంలో హఠాత్తుగా కిందపడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిన్న వయసులో కిషోర్ గుండెపోటుతో మరణించడాన్ని ఆయన స్నేహితులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.