వాటర్ ట్యాంక్ పైపులైన్‌లో ఇరుక్కుని కార్మికుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

వాటర్ ట్యాంక్ పైపులైన్‌లో ఇరుక్కుని కార్మికుడి మృతి

June 8, 2022

ఓవర్‌హెడ్‌ వాటర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఓ కార్మికుడు.. పైపులైన్‌లో జారిపడి మృతి చెందాడు. ఖమ్మంలో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈ ప్రమాదంలో కార్మికుడి మృతదేహాన్ని బయటికి తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఖమ్మం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్న చిర్రా సందీప్‌(23)… నగరంలోని నయాబజార్‌ పాఠశాల పక్కనే ఉన్న మిషన్‌ భగీరథ ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకును శుభ్రం చేసేందుకు మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఎక్కాడు. శుభ్రం చేసిన అనంతరం ప్రమాదవశాత్తూ అతని కాలు ట్యాంకు నుంచి నగరానికి నీటి సరఫరా అయ్యే పైపులైన్‌లో ఇరుక్కుంది. ట్యాంకులో మోకాళ్ల లోతు నీళ్లుండగా, ఒక్కసారిగా ప్రవాహం రావడంతో దాని ఒత్తిడికి పైపులైన్‌లోకి వెళ్లిపోయాడు. నీటి ఉద్ధృతికి జారతాడనుకొని కొందరు వాల్వు తిప్పగా.. కిందవరకు వచ్చి అందులోనే ఇరుక్కుపోయాడు. అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.

విషయం తెలియడంతో సహాయ చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. సందీప్‌ మృతదేహాన్ని వెలికితీయడానికి అధికారులు, సిబ్బంది సుమారు 5 గంటలపాటు కష్టపడ్డారు. జేసీబీ సాయంతో పైపులైన్‌ను పగులగొట్టారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సందీప్‌ చనిపోయాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఎస్పీ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం, రెండు పడకగదుల ఇల్లు, ఇంటిస్థలం, కుటుంబంలో ఒకరికి నగరపాలక సంస్థలోనే పొరుగుసేవల్లో ఉద్యోగం, దళితబంధు పథకం ఇప్పిస్తామని పోలీసు అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు.