వివాహితతో సహజీవనం.. రేప్ కేసు బెదిరింపులకు యువకుడు బలి - MicTv.in - Telugu News
mictv telugu

వివాహితతో సహజీవనం.. రేప్ కేసు బెదిరింపులకు యువకుడు బలి

June 3, 2022

వివాహేతర సంబంధాలు.. నేరాలకు దారి తీసి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. వివాహితతో 22 రోజుల పాటు సహజీవనం చేసిన యువకుడు.. ఆమె భర్త బెదరించడంతో చివరకు ప్రాణాలే తీసుకున్నాడు. మధ్యప్రదేశ్లో ఇండోర్‌లోని బంగంగా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుఖ్లియా ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న సాగర్ కుష్వాహ అనే యువకుడు.. ఓ మహిళ మాయలో పడ్డాడు. ఆమెకు ఇంతకుముందే పెళ్లయింది. భర్తను వదిలి ఆ యువకుడు దగ్గరకు వచ్చింది. అతడితో కలిసి 22 రోజులపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోయింది.

అయితే ఇదే విషయాన్ని అదనుగా తీసుకున్న ఆమె భర్త బబ్లూ.. సాగర్ను వేధించడం ప్రారంభించాడు. రూ.5 లక్షలు రూపాయలు ఇవ్వకపోతే అత్యాచారం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. బబ్లూ మరదలు కిరణ్ నిహారే కూడా సాగర్ను మానసికంగా వేధించింది. దీంతో వాటిని భరించలేక అతడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారని బబ్లూతోపాటు అతడి మరదలుపై కేసు నమోదు చేశారు.