కాలేజీకి వెళ్లే కుర్రాడి చేతిలో స్మార్ట్ ఫోన్ పెడితే ఏమవుద్ది.? కాస్త తెలివి, బుద్ధి ఉన్నోళ్లతే ఆన్లైన్ క్లాసులకో, లేదంటే యూట్యూబ్ ఎడ్యూకేషన్ వీడియోస్ చూడ్డానికి వాడతారు. లేదంటే ఫ్రెండ్స్‌తో కాల్స్, చాటింగ్ ఇలాంటివి ఏదో ఒక దానికి వాడతారు. కానీ రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి మాత్రం.. సెల్ఫోన్లో క్యాసినో ఆడి రూ. 92లక్షలు పోగొట్టాడు. తల్లిదండ్రులకు భూసేకరణ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంత పెద్ద మొత్తాన్ని విడతల వారీగా ఉఫ్ అని ఊదేశాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల సీతారాంపురం గ్రామానికి చెందిన చన్‌వళ్లి శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. వ్యవసాయమే వారికి జీవనాధారం. వీరి చిన్న కొడుకు హర్షవర్ధన్‌రెడ్డి (19) నిజాం కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శ్రీనివాస్‌రెడ్డి 10 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం భూసేకరణ కింద ఎకరాకు రూ.10.5లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. దీంతో కుటుంబానికి దాదాపు రూ.1.05 కోట్లు వచ్చింది. ఇందులో రూ.85 లక్షలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి, తల్లి విజయలక్ష్మి బ్యాంకు ఖాతాల్లో రూ.42.5 లక్షల చొప్పున జమచేశారు. ఈ డబ్బుతో శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద భూమి కొనేందుకు శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికే ఫోన్లో కింగ్ 567 క్యాసినో పేరుతో ఆన్లైన్ గేమ్ ఆడుతున్న హర్షవర్ధన్‌రెడ్డి.. పరిహారంగా వచ్చిన డబ్బు విషయం తెలుసుకున్నాడు.
రెండు రోజుల్లో భూ లావాదేవీలు జరగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు.. కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి యజమానికి డబ్బు ఇస్తానంటూ కొడుకు చెప్పడంతో.. తమ ఖాతాలో ఉన్న డబ్బును అతడి ఖాతాలోకి బదిలీ చేశారు. ఇంకేముంది.. చేతిలో ఫోన్.. అందులోనే గేమ్.. అకౌంట్లో డబ్బులు.. ఆన్లైన్ గేమ్ ఆడుతూ తన అకౌంట్లి రూ.42.5 లక్షలను దఫదఫాలుగా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో ఉంచిన సొమ్మునూ ఆటలో కోల్పోయాడు. డబ్బు గురించి అడగ్గా.. ఆన్లైన్లో గేమ్ ఆడి పోగొట్టినట్లు ఇంట్లో వాళ్లకు తెలిపాడు. అతడు గ్రామంలోని మరొకరి వద్ద రూ.7 లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి మొత్తం రూ.92 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకునే కుమారుడు ఇలా చేసినట్లు తెలుస్తోంది.