హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. తను ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడుతున్నాడని.. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని.. ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా చంపిన ఘటన మరవక ముందే మరో ఉదంతం ఆలస్యంగా వెలులోకి వచ్చింది. బాలాపూర్‌లోని ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఫైజల్ ఈ నెల 12న రాత్రి 9 గంటలకు బటకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి కనిపించకుండా పోయాడు. తమ కొడుకు ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఫైజల్ తల్లిదండ్రులు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. శనివారం రాత్రి మినార్ కాలనీ సమీపంలో ఫైసల్ మృతదేహాన్ని గుర్తించారు.
అదృశ్యమైన రోజే అతను హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఫైజల్‌పై కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. బండరాయితో తలపై కొట్టి హతమార్చిన అనంతరం.. తల, మొండెం వేరు చేశారు. ఈ వ్యవహారంలో అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మినార్ కాలనీలోని ఖాళీగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో ఫైజల్‌ను హత్య చేసి దుర్వాసన రాకుండా మృతదేహంపై మట్టి పోసి నిందితుడు వెళ్లిపోయాడని చెప్పారు. ఈ హత్య చేసింది ఫైజల్ స్నేహితుడు జబ్బార్ అని చెబుతున్నారు. మృతుడు, నిందితుడు కలిసి ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి దాదాపు 6 నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిందుతులను ఎవరైనా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.