ప్రేమ పేరుతో ముగ్గురు యువతుల జీవితాలతో ఆడుకున్నాడు ఓ దుర్మార్గపు ఎస్ఐ. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐగా పనిచేస్తున్న రమావత్ విజయ్‌కుమార్ నాయక్.. ప్రేమ పేరుతో అమ్మాయిలని మోసగించడమే అతని పని. ఆ క్రమంలోనే అనంతపురం జిల్లాకు చెందిన భారతి అనే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో ఆమె.. గట్టి షాక్ ఇచ్చింది. ఆ ఎస్ఐపై దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తొమ్మిది నెలల క్రితం పెళ్లితో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది.
అంతటితో ఆగకుండా తన సొంతూరులోని సరస్వతి అనే అమ్మాయి తోనూ ప్రేమాయణం నెరిపాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. రెండు రోజుల క్రితం సరస్వతి జీఏ కొట్టాలలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి నిన్న(శుక్రవారం) మృతి చెందింది. సరస్వతి తండ్రి తిరుపాల్‌నాయక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయకుమార్‌పై పామిడి సీఐ ఎం.ఈరన్న కేసు నమోదు చేశారు. పోలీసులు అతడిని చంద్రగిరిలో అదుపులోకి తీసుకొని పామిడికి తీసుకెళ్లారు. విజయ్‌కుమార్ ఎస్ఐ కాక ముందు గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఓ మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో వంచించినట్లు సమాచారం.