కువైట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ.. భరించలేక భర్తకు సెల్ఫీ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కువైట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ.. భరించలేక భర్తకు సెల్ఫీ వీడియో

May 31, 2022


బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన ఓ పేద మహిళను ఏజెంటు, అతని మిత్రుడు తమ కామవాంఛ తీరిస్తేనే మంచి ఇంట్లో పనికి కుదురుస్తామంటూ ఆమెను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆహారం, నీరు అందించకుండా పస్తు ఉంచారు. బాధిత మహిళ తన భర్తకు సోమవారం రాత్రి తన దుస్థితిని వీడియో తీసి ఫోన్‌ ద్వారా పంపించారు. తనను కాపాడి స్వస్థలం తిరుపతి జిల్లాకు తీసుకురావాలని విలపిస్తూ వేడుకున్నారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లె పంచాయతీకి చెందిన ఓ మహిళ(26) ఈనెల 24న కువైట్ వెళ్లారు. చెంగల్‌ రాజు అనే ఏజెంట్‌ ఆమె గల్ఫ్‌ చేరేందుకు సహకరించాడు. అక్కడికెళ్లాక ఓ ఇంట్లో పనికి కుదిరాక.. ప్రస్తుత యజమాని సరిగా చూసుకోవడం లేదని , మరో చోట పనికల్పించాలని ఏజెంట్‌ను కోరారు. ఏజెంట్‌ చెంగల్‌రాజు, అతడి మిత్రుడు బావాజీ ఇదే అదునుగా ఆమెను అక్కడ ఓ గదిలో బంధించి శారీరకంగా, మానసికంగా హింసించారు. నాలుగు రోజులుగా తిండి కూడా పెట్టకుండా నీళ్లు మాత్రమే ఇస్తున్నారని శ్రావణి భోరున విలపించింది. సోమవారం రాత్రి 10 గంటలకు తిరుపతిలోని తన భర్తకు వీడియో పంపింది. తనను ఎలాగైనా తిరుపతికి తీసుకొచ్చేయమని వేడుకుంది. ఈ విషయమై బాధితురాలి భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.