మాస్క్ పెట్టుకోలేదని.. కిడ్నీ చితగ్గొట్టిన పోలీస్ - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ పెట్టుకోలేదని.. కిడ్నీ చితగ్గొట్టిన పోలీస్

July 14, 2020

Alirajpur

కరోనా వైరస్ కారణంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఫేస్ మాస్కును కొందరు తెలిసో తెలియకో పెట్టుకోకుండానే బయటకు వస్తున్నారు. అలాంటివారికి కొన్ని రాష్ట్రాలు భారీ జరిమానాలు విధిస్తున్నాయి. కరోనా సమయంలో ముఖానికి మాస్కు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం, భౌతికదూరం పాటించడాన్ని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా భావించాలని నిత్యం ప్రతీ గ్రామంలో చాటింపు వేసి మరీ చెబుతున్నారు. అయినా కొందరు మరిచిపోయో, పట్టనట్టో మాస్కు ధరించకుండా బయటకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మాస్కు ధరించని ఓ వ్యక్తిని పోలీసు కానిస్టేబుల్ చితగ్గొట్టాడు. దీంతో అతని కిడ్నీ దెబ్బతింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలిరాజాపూర్‌లో చోటు చేసుకుంది. 

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి బైకు మీద వేరే ఊరికి బయలుదేరాడు. దారి మధ్యలో ఓ పోలీసు కానిస్టేబుల్ అతన్ని అడ్డుకున్నాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించాడు. ఈ విషయమై ఇద్దరిమధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం నెలకొంది. చుట్టుపక్కల వాళ్లు అక్కడున్నా.. చోద్యం చూశారే తప్ప వారిని విడిపించే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు ఆ కానిస్టేబుల్‌కు ఓ కర్రను అందించారు చితగ్గొట్టమని. రెండు తగిలిస్తేనే ఇలాంటివారికి బుద్ధి వస్తుందని అన్నారు. వాళ్లు అతని చేతులు పట్టుకుంటే కానిస్టేబుల్ కొట్టాడు. మధ్యలో వారు కూడా అతన్ని కొట్టారు. కర్రతో బాధితుడిని విచక్షణారహితంగా  కొట్టడంతో.. తీవ్ర గాయాల పాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతని నడుము భాగంలో బాగా కొట్టడంతో అతని కిడ్నీ ఒకటి దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అతనికి తగిన చికిత్స చేస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అధికారులు సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు.