Your legs will give up just by voting..Video goes viral
mictv telugu

ఓటు వేస్తానంటేనే మీ కాళ్లు వదులుతా..వీడియో వైరల్

August 27, 2022

‘కూటి కోసం-కోటి తిప్పలు’ అనే సామెత మనందరికీ సుపరిచితమే. కానీ, రాజకీయ నాయకులు మాత్రం ఓట్ల సమయంలో ఇంటింటికి, వీధి వీధికి తిరుగుతూ, ‘ఓటు కోసమే-మా ఈ తిప్పలు’ అంటూ పలు రకాలుగా హామీలు ఇస్తూ, తమ పార్టీకే ఓటు వేయాలని ఓటక దేవుళ్లను వేడుకుంటారు. ఓటు సమయంలో గుడిసెలో నడవలేని స్థితిలో ఉండే వృద్దురాలిని సైతం తమ చేతులతో ఎత్తుకొని, ఓటు వేసేలా చేస్తారు. ఈ క్రమంలో ఓట్ల కోసం కొంతమంది విద్యార్థులు చేస్తున్న వినూత్న తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం బరాన్‌లో శుక్రవారం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు..విద్యార్థులు వినూత్నంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఓటు వేయాలంటూ ఎదురుపడిన విద్యార్థినీ, విద్యార్థుల కాళ్లపై పడి, వేడుకున్నారు. దయచేసి విలువైన మీ అమూల్యమైన ఓటు తమకే వేసి, గెలిపించాలంటూ ప్రాధేయపడ్డారు. వీలైతే నేలపై పడుకుని, కాళ్లను పట్టుకుని వేడుకున్నారు. కాళ్లు దొరక్కపోతే నేలపై పడుకుని దండం పెట్టి, ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. మోకాళ్లపై నించుని అడిగారు. అదీ కుదరకపోతే రెండు చేతులు జోడించి శిరసు వంచి నమస్కరించి, తమను గెలిపించాలని కోరారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ వీడియోలో అబ్బాయిలనే కాదు, విద్యార్థినులు సైతం ఇవే చర్యలకు దిగారు. వీరి చర్యలతో కొందరు విద్యార్థినులు అసౌకర్యానికి గురి కాగా, కొందరు నవ్వు ఆపుకోలేకపోయారు.