మద్యం మత్తులో నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. నార్సింగ్‌లో సోమవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి దిగి అరాచకం సృష్టించారు. ఈ దాడిలో సంజయ్ అనే యువకుడు మృతి చెందాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దాడికి పాల్పడిన యువకులపై హత్య కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి నగర శివారు ప్రాంతమైన నార్సింగి పెట్రోల్ బంక్ వద్దకు ఓ వైట్ కార్ వచ్చి ఆగింది. సిబ్బంది పెట్రోల్ లేదని సమయం ముగిసిందని ముందే తెలిపారు. అయినా దూర ప్రయాణం చేయాలని పెట్రోల్ పోయాలని విజ్ఞప్తి చేశారు కారులోని యువకులు. తీరా కారులో పెట్రోల్ పోయించుకున్న యువకులు కార్డు ఇచ్చారు. స్పైపింగ్ మెషిన్ లేదని డబ్బు చెల్లించాలని సిబ్బంది అడగడంతో కారులోని ముగ్గురు యువకులు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్ అనే యువడి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సంజయ్ మరణించాడని తెలుసుకుని వెంటనే యువకులు కారులో పరారయ్యారు. ఈ దృష్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. నిందితులు జన్వాడకు చెందిన నరేందర్, మల్లేశ్, అనూప్‌గా గుర్తించారు. వారిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.