కొండచిలువతో వా(పా)కింగ్.. దిమ్మతిరిగే సమాధానం..  - MicTv.in - Telugu News
mictv telugu

కొండచిలువతో వా(పా)కింగ్.. దిమ్మతిరిగే సమాధానం.. 

October 2, 2020

Youth walking python Brighton east Sussex police warns  .

పెంపుడు జంతువులను అలా కాసేపు షికారు తీసుకెళ్లడం మనం చూస్తుంటాం. కుక్క, పిల్లి.. కాస్త తేడా టేస్ట్ ఉన్నావాళ్లయితే మిగతా జంతువులను రోడ్లపైకి పట్టుకొస్తుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా 12 అడుగుల పొడవైన కొండచిలువతో రోడ్డున పడ్డాడు. దాన్ని రోడ్డమ్మట పాకిస్తూ షికార్లు కొట్టాడు. కొందరు సరదాగా చూస్తే, కొందరు వామ్మో అని ఆడమదూరం పారిపోయారు. ఏంటి ఈ న్యూసెన్స్ అంటూ పోలీసులు అక్కడికొచ్చి విచారణ జరిపారు. ఆ యువకుడు ఇచ్చిన సమాధానం విని వాళ్లకు బుర్ర తిరిగిపోయింది. 

‘దానికి ఇంట్లోనే కడుపు నిండా తిండిపెట్టి తీసుకొచ్చా. అది ఎవర్నీ మింగదులెండి. జస్ట్ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయడానికి ఇలా తీసుకొచ్చా.. ఏం, జంతువులకు ఈ ప్రపంచంలో స్వేచ్ఛ లేదా? కుక్క, పిల్లి మాత్రమే పెంపుడు జంతువులా? ఇంకేవీ కావా? రూల్స్ మార్చండి’ అని క్లాసు పీకాడు. 

బ్రిటన్‌లోని ఈస్ట్ ససెక్స్‌లో గురువారం ఈ వింత కనిపించింది. పోలీసులు ఎంతైనా పోలీసులే కదా. కొండచిలువ పెంపుడు జంతువో కాదో తర్వాత చూసి చెప్తామని, ప్రస్తుతానికి మర్యాదగా ఇంటికి తీసుకెళ్లాలని అబ్బాయిని హెచ్చరించాడు. దీంతో అతడు తిట్టుకుంటూ దాన్ని మెడలో వేసుకుని ఇంటికి పట్టుకెళ్లాడు. జంతుప్రేమికులు కూడా అతణ్ని తిడుతున్నారు. కారో, గీరో గుద్దితే అతి చచ్చిపోతుందని, బయటికి తీసుకురావొద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు.