Youth who are in love must follow these safeties
mictv telugu

లవ్‌లో ఉన్న అబ్బాయిలు ఈ పనులు అస్సలు చేయకూడదు!

February 25, 2023

ప్రాణాలంటే లెక్కా జమా లేకుండా సఫా చేస్తున్న పాడు కాలమిది. మనకు తెలియకుండానే మనచుట్టూ బోలెడు మంది శత్రువులు ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జీవితాలు కడతేరిపోయాయి. రోడ్డు ప్రమాదాల నుంచి, నయంకాని కేన్సర్, ఎయిడ్స్ వంటి జబ్బుల నుంచి ఎలాగూ బయటపడలేం. కానీ, కొన్ని ముందే తెలిసిన ముప్పులను సులువుగానే తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మునిగితేలేవాళ్లు చాలా అలర్ట్‌గా ఉండాలి.

అమ్మాయిలు, అబ్బాయిలు.. తమను ఎవరూ గమనించడం లేదని అజాగ్రత్తగా ఉంటే ప్రేమచరిత్ర కాస్తా ‘మరోచరిత్ర’ సినిమాలా రక్తచరిత్రలుగా మారతాయి. తాజాగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద నవీన్ కుర్రాడిని హరిహరకృష్ణ అనే స్నేహితడే దారుణంగా హతమార్చి, పెదాలు, గుండె కోసం వాటి ఫోటోలు తను ప్రేమిస్తున్న యువతికి వాట్సాప్ చేయడం కలకలం రేపుతోంది. గెట్ టు గెదర్ పార్టీ అని నవీన్ ను తీసుకెళ్లిన హరిహర మూడు నెలల కిందటి నుంచే హత్యకు పథకం వేశాడట. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించి, గొడవపడ్డమే ఈ ఘోరానికి కారణం! ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న అబ్బాయిలు పాతికేళ్లు నిండకుండానే కడతేరిపోతే వారిపై ఆశలు పెట్టుకున్న, ఆధారపడిన కుటుంబాల్లో చీకటి మిగులుతుంది. అందుకే ప్రేమమైకంలో ఉన్న యువకులు తమ కోసం, తమ కుటుంబాల కోసం కాస్త ముందూ వెనకగా చూసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రేమ సంగతి పక్కనబెడితే ప్రాణాలు మిగిలి ఉంటాయి.

1. మీరు ప్రేమిస్తున్న విషయాన్ని మీ ఇంట్లోవాళ్లకు కచ్చితంగా చెప్పండి. అమ్మాయి ఎవరో, వాళ్ల పరపతి ఏమిటో కూడా వివరించండి. ఇంట్లోవాళ్లు ‘వద్దురా కొడుకా’ అంటే పరిస్థితిని బట్టి వాళ్ల సూచనలు పాటించండి. మీరు మరీ అంత గాఢంగా ప్రేమిస్తుంటే నచ్చజెప్పడానికి ప్రయత్నించండి. ఇదేదో రాజీ పడాలని, మీ ప్రేమను తుంచుకోవాలని కాదు. రేపు ఏదైనా సమస్య వస్తే అందరికంటే ముందు మీకు అండగా నిలబడేది మీ ఇంట్లోవాళ్లే కదా.

2. మీ ప్రేయసితో ఎక్కడికీ ఒంటరిగా వెళ్లొద్దు. ఊరి బయటికి, తెలియని వారి ఇళ్లకు అస్సలు వెళ్లొద్దు. కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక శక్తులు తిష్టవేసి ఉంటాయి. మీరిద్దరే ఉన్నారని తెలిస్తే అఘాయిత్యానికి పాల్పడే అవకాశముంటుంది. లాంగ్ డ్రైవ్స్ కూడా అసలు చేయద్దు. మీరంటే గిట్టని వాళ్లు ఫాలో అవుతూ రోడ్డుమీదే ఏదైనా ఘాతుకానికి పాల్పడొచ్చు.

3. మీ లవర్‌ను మరెవరైనా ప్రేమిస్తున్నారో లేదో ఆరా తీయండి. ఇదేం తప్పు కాదు. అనుమానం వేరు, అంచనా వేరు. ఒక అబ్బాయి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను లైన్లో పెట్టే కేసుల మాదిరే ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గుర్ని లైన్లో పెట్టి ఉండొచ్చు. ఇలాంటి ఉదంతాల్లో గొడవలు చాలా సహజం. మీ లవర్ డబుల్ గేమ్, త్రిబుల్ గేమ్ ఆడుతున్నట్లు తెలిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేయండి. విషయం మీ ‘పోటీదారులకు’ కూడా తెలిసేలా ఏదైనా చేయండి, వాళ్లు చాలా సంతోషిస్తారు.

4. అమ్మాయికి మీరు కాకుండా మరెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వారితో జాగ్రత్తగా మెలగండి. కేవలం పలకరింపులకే పరిమితం అవండి. సోషల్ మీడియాలోనూ అంతే. మరీ డీప్‌గా వెళ్లి మీ ప్రేమపురాణంపై గొప్పలు చెప్పకండి. వాళ్లు అసూయడతారు.

5. కొన్ని అరుదైన సందర్భాల్లో అమ్మాయిల సోదరులు, బావలు వంటి వారు కూడా పరిచయం కావొచ్చు. వారితో మరింత జాగ్రత్తగా ఉండాలి.

6. మీ ‘పోటీదారులు,’ లేకపోతే అమ్మాయి తరఫు బంధువులు (ముఖ్యంగా ఆమె తండ్రి, అన్నదమ్ములు, బాబాయిలు, మేనమామలు, అంతగా పరిచయం లేని వ్యక్తులు) పార్టీ చేసుకుందాం బ్రో, బావా అని పిలిస్తే అసలు వెళ్లకండి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మీ వెంట నలుగురైదుగురిని తీసుకెళ్లి, వెళ్తున్న విషయాన్ని ఇంట్లో చెప్పండి. మద్యం, డ్రగ్స్ వంటివి అసలు తీసుకోవద్దు. మద్యం ఆఫర్ చేస్తే బుద్ధిమంతుడిలా నో చెప్పిండి. మర్యాదకు తాగాలనిపిస్తే కొంచెమే పుచ్చుకోండి. ఒళ్లు తెలియనంతగా ఎప్పుడూ తాగొద్దు.

7. అమ్మాయి ప్రవర్తనలో ఏదైనా తేడా వస్తే ఆమెతోనూ అసలు ఒంటరిగా వెళ్లొద్దు.

8. మీ ఫోన్లో పోలీసుల హెల్ప్ లైన్ నంబర్లు, మీ ఇంట్లోవాళ్ల నంబర్లు, ఇంటి చిరునామా ఉండే ఐడెంటిటీ కార్డులు తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి. కొంత నగదు కూడా ఉంచుకోండి.

9. మీ ప్రేమ విషయంలో అమ్మాయి తరఫు బంధువులు బెదిరిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. పోలీసులు కూడా వాళ్లతో కుమ్మక్కయ్యారని భావిస్తే పైస్థాయి పోలీసులకు చెప్పండి. బెదిరింపు కాల్స్‌ను రికార్డు చేసి పెట్టుకోండి. త్రెట్ ఉందని తెలిస్తే ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దు. రాత్రిపూట అసలు బయటికి వెళ్లొద్దు. తప్పనిసరైతే ఇద్దర్నో, ముగ్గుర్నో వెంటబెట్టుకుని వెళ్లండి.

10. అన్నింటికంటే ముఖ్యం మీ కెరీర్. లవ్‌లో.. లేచిపోవడం, చెప్పకుండా పెళ్లిచేసుకోవడం వంటి ఏదైనా ఎక్స్‌ట్రీ‌మ్ స్టెప్ తీసుకునే ముందు బాగా ఆలోచించండి. స్నేహితులో, ఇట్లోవాళ్లతో చర్చించండి. ఉన్నది ఒకటే జీవితం. దాన్ని ఉత్తిపుణ్యానికి నిన్నో మొన్నో పరిచయమైన అమ్మాయి కోసం ధారపోయొద్దు. ప్రేమపంట పండితే సంతోషమే. కానీ దాని కోసం ప్రాణాలు ధారపోయాల్సిన పని లేదు. ఈ ప్రపంచం చాలా పెద్దది. మిమ్మల్ని ప్రేమించేవాళ్లు ఎందరో ఉంటారు. బెస్టాఫ్ లక్.