పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించినట్లు భావించిన బాలుడు పాతికేళ్ల వయసులో (15 ఏళ్ల తర్వాత) ప్రత్యక్షమయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దెవరియా జిల్లా భాగల్పుర్ బ్లాక్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. మురాసో గ్రామానికి చెందిన అంగేశ్ యాదవ్ అనే యువకుడు 15 ఏళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు వారి సంప్రదాయం ప్రకారం కుమారుడిని అరటిబోదెలకు కట్టి సరయు నదిలో విడిచిపెట్టారు. బాలబాలికలు మరణిస్తే ఇక్కడ ఇలానే అంత్యక్రియలు చేస్తారట.
అయితే, ఆదివారం అంగేశ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని గుర్తు పట్టి వెంట తీసుకెళ్లారు. దీంతో ఇదెలా సాధ్యమైందన్నది అర్ధం కాని కుటుంబసభ్యులు, గ్రామంలోని ప్రజలు అంగేశ్ ను అసలేమైంది ఆరాతీశారు. పదేళ్ల వయసులో జరిగింది కనుక అంగేశ్ కూడా ఆనాడు జరిగింది పూసగుచ్చినట్లు చెప్పాడు. పాముకాటు తర్వాత ఏం జరిగిందన్న విషయం తనకు గుర్తు లేదని.. కానీ, తనకు మెలకువ వచ్చేసరికి బీహార్ రాజధాని పాట్నాలో పాములు పట్టే వ్యక్తి తనకు చికిత్స అందిస్తూ కనిపించాడన్నాడు. అతడే తనను పెంచి పెద్దచేశాడని చెప్పాడు.
పంజాబ్‌లోని ఓ భూస్వామి దగ్గర పనిచేసే అంగేశ్ తన గతం గురించి ఓ లారీ డ్రైవర్‌కు చెప్పాడు. ఆ డ్రైవర్ అతడిని ఆజంగఢ్ తీసుకొచ్చి విడిచిపెట్టాడు. అక్కడ మరికొందరికి తన గ్రామం గురించి చెప్పాడు. వారిలో ఒకరు అతడి ఫొటో తీసి మురసో గ్రామంలో తెలిసిన వారికి పంపించారు. తర్వాత మనియార్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను.. అంగేశ్ గుర్తుపట్టాడు. పోలీసులు.. అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.