youtube new feature for search in viewing video to trace needed content
mictv telugu

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. సెర్చ్ మరింత సులభం..

December 19, 2022

ఎప్పటికప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు తీసుకొస్తున్న ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్ సెర్చింగ్‌ను మరింత సులభతరం చేసే కొత్త ఫీచర్ పట్టుకొచ్చింది. దీని ద్వారా మనం వీడియో చూస్తూనే అందులో మనకు కావాల్సిన కంటెంట్‌ను సెర్చ్ చేసుకోవచ్చు. ‘సెర్చ్ ఇన్ వీడియో’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆప్షన్ వివరాలను ఢిల్లీలో జరుగుతున్న గూగుల్ ఫర్ ఇండియా సమావేశంలో వెల్లండారు. వీడియో చూస్తున్నప్పుడు అందులో మనం చూడాలనుకున్న కంటెంట్ ఏమిటో టైప్ చేసి అక్కడే వెతుక్కోడానికి దీన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

ఉదాహరణకు ఢిల్లీ టూరిజం వీడియోను చూస్తున్నప్పుడు ఆ నగరంలోనూ ఆ చుట్టుపక్కలకు సంబంధించిన కంటెంట్‌ను చూడ్డానికి ఈ ఆప్షన్ వాడొచ్చు. ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వంటి వాటి పేర్లను వీడియో కింద కుడివైపు ఉన్న సెర్చ్ టూల్‌బార్‌లో టైప్ చేస్తే వీడియోలో ఆయా కంటెంట్స్ కనిపిస్తాయి. దీనివల్ల మొత్తం వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. సమయం, డేటా ఆదా అవుతాయి. ఈ ఫీచర్‌తోపాటు నచ్చిన భాషలో సెర్చ్ చేసుకునే ఫీచర్లను కూడా తీసుకొస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. మల్టీసెర్చ్, బైలింగ్వల్ సెర్చ్ ఫీచర్ల ద్వారా మనకు సులువైన తెలుగు, హిందీ వంటి భాషల్లోనే సెర్చ్ చేసి సమాధానం పొందొచ్చు. తొలుత హిందీలో ఈ ఫీచర్ వస్తుందని, తర్వాత తెలుగు, మరాఠీ, తమిళం వంటి భాషల్లో తీసుకురానున్నారు.