యూట్యూబ్ స్టార్ వంటల తాత ఇకలేడు..  - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్ స్టార్ వంటల తాత ఇకలేడు.. 

November 1, 2019

యూట్యూబ్‌లో తన చేతి వంటలతో ప్రేక్షకులను నోరూరించారు. ఆయన వంటలు చేస్తున్న వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. తాత వంటకాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. ఆయన చేపల కూర చేసినా, నాటుకోడి కూర వండినా, పీతల చారు పెట్టినా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అంత రుచిగా ఉంటాయి మరి ఆయన వంటలు. వంటలతో ఫేమస్ అయిన ‘గ్రాండ్ పా కిచెన్’లో ఇక ఆయన కనిపించరు, వినిపించరు. ఆయన చేతివంటల రుచులు ఇకపై వీడియోలను రీక్యాప్ చేస్తూ చూసుకోవడమే. కేవలం వంటలతో సెలబ్రిటీ అయిపోయిన నారాయణ రెడ్డి(73) కన్నుమూశారు. ఇది సదరు ఛానల్‌కు ఉన్న 6.11 మిలియన్ల  సబ్‌స్క్రైబర్లకు చేదువార్తే. అక్టోబర్‌ 27న వంటల తాత మృతి చెందినట్లు ఆయన అనుచరులు ఛానెల్‌లో తెలిపారు. ఆయన మృతిపై పలువురు నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

2017 ఆగస్టులో నారాయణ రెడ్డి ‘గ్రాండ్‌పా కిచెన్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఛానల్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ వంటల తాత ఒకేసారి పెద్ద మొత్తంలో వంటకాలు చేసి అనాథ పిల్లలకు పంపిణీ చేస్తుంటారు. వాటినే యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. వచ్చిరాని ఇంగ్లీషులో ఆయన వంటకాల తయారీని ప్రేక్షకులకు వివరించేవారు. ఈ వంటల తాత ప్రాంతీయ వంటకాల నుంచి విదేశీ వంటకాలు కూడా చేసి రుచి చూపించేవారు. కాగా, యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వచ్చిన డబ్బును పేద పిల్లల, అనాథ పిల్లల కోసం ఉపయోగించేవారు.