YouTuber says Redmi phone explosion kills aunt, company in touch with kin
mictv telugu

ఫోన్‌ను తల పక్కన పెట్టి పడుకుంది… ఆమె లేదు, మీరు జాగ్రత్త!!

September 13, 2022

చాలా మంది నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ ను పక్కనే పెట్టుకుంటారు. అలా చేయడమే ఒక మహిళ ప్రాణాలు తీసింది. తల పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ పేలడంతో ఢిల్లీకి చెందిన ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసింది. వివరాల్లోకి వెళ్తే..సదరు మహిళ రెడ్‌మీ 6ఏ సెల్ ఫోన్ వాడుతోంది. ఈ క్రమంలో రాత్రిపూట ఫోన్ వాడిన ఆమె.. దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ఆ సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు. దీనికి సబంధించిన వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్‌మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. కాసేపటికి అది పేలిపోవడంతో ఆమె చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత బ్రాండ్‌పై ఉంటుంది’ అని అతడు ట్వీట్ చేశారు. ‘మొబైల్స్ తయారీ సంస్థలు మొబైల్స్ విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలి. మొబైల్స్ మార్కెట్ లోకి విడుదల చేసేటపుడు క్షుణ్ణంగా అన్ని విషయాలు గమనించుకున్న తరువాతనే విడుదల చేస్తే ప్రజలకు రక్షణ ఉంటుంది. అలాగే ప్రభుత్వం మొబైల్ తయారీ సంస్థల విషయంలో చాలా కఠిన నిబంధనలు విధించాలి’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ ఘటనపై తాము కూడా విచారణ జరుపుతున్నట్లు రెడ్‌మీ కంపెనీ వెల్లడించింది. ‘మొబైల్ ఎందుకు పేలింది అనే కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, వివరాలు తెలిసిన తరువాత మేము ఏం చేస్తామన్నది వెల్లడిస్తాం..’ అని చెప్పింది.